Dec 09,2022 00:06

మాట్లాడుతున్న గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్‌

ప్రజాశక్తి-ఎటపాక
గిరిజనులకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఉద్యమం ఆగదని ఎపి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎటపాకలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పోరాటంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 8 రోజులుగా 150 మంది ఆదివాసి ప్రజానీకం ఇంటి స్థలాలు ఇవ్వాలని ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వానికి కళ్ళు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అధికారం కోసం అనేక వాగ్దానాలు చేస్తున్న ఈ పాలకులు ఆదివాసీలకు ఐదు సెంట్లు భూమి ఇవ్వడానికి ఎందుకు చేత కావడంలేదన్నారు. ఇప్పటికైనా గిరిజన బిడ్డలపై కాస్తాయినా ప్రేమ ఉంటే వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు కాకా అర్జున్‌ దొర, అజరు కుమార్‌, కారం నగేష్‌, నక్క సూరిబాబు, బుద్ధుల భద్రయ్య, సవలం రాము తదితరులు పాల్గొన్నారు.