ఇళ్ల స్థలాలు చూపించాలని నిరసన
ప్రజాశక్తి-వరికుంటపాడు : సుమారు 25 ఏళ్ల క్రితం తమకు ఇచ్చిన ఇంటి నివేశన పట్టాలకు సంబంధించి ఇంతవరకు హద్దులు చూపకపోగా వాటిని పట్టించుకున్న నాథుడే లేడని, మండలంలోని రజకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్యను తెలిపారు. అనంతరం తహశీల్దార్ సయ్యద్ ఇక్బాల్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సర్వే నెంబర్ 196/1లో 40 మంది రజక కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇచ్చారని కానీ, ఇంతవరకు హద్దులు చూపకపోగా ఇటీవల ఇద్దరికీ ఆ పట్టాలలోనే మార్చి పట్టాలు ఇచ్చారని ఇది ఎంతవరకు న్యాయమని వారు తహశీల్దారు దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవాలను పరిశీలించి సత్వరమే న్యాయం చేస్తానని తహశీల్దార్ వారికి హామీనిచ్చారు. పొజిషన్ సర్టిఫికెట్లను తీసుకురావాలని, అలాగే సర్వేయర్లు, విఆర్‌ఒలు, రెండు మూడు రోజుల్లో నివేశన పట్టాలను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి రజకులకు న్యాయం చేయాలని కోరారు.










