ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సిఆర్‌డిఎ ప్రాంతంలోని ఆర్-5 జోన్óలో ఎన్‌టిఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలిచ్చేందుకు హైకోర్టు శుక్రవారం పచ్చజెండా ఊపింది. తుది తీర్పునకు లోబడి స్థలాలు ఇవ్వాలని సూచించింది. ఇతర ప్రాంతాలకు చెరదిన వారికి ఇళ్లస్థలాలను కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. అయితే రైతుల వ్యక్తం చేసిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. రాజధానిలో ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పడం సరికాదని, రాజధాని అందరిదని హైకోర్టు పేర్కొంది. భూ సమీకరణలో ఇచ్చిన భూములకు ప్రతిగా సిఆర్‌డిఎ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లపైనే రైతులకు హక్కులుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. ఈ అంశంలో తుది తీర్పు ఇంకా రావాల్సి ఉందని, ఈ అంశంపై న్యాయకోవిదులతో చర్చిస్తామని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు.
కోర్టు నుంచి అడ్డంకులు తొలగిపోవడంతో అధికారులు తమ ప్రక్రియను వేగవంతం చేశారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశం ఇప్పటికీ కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాజధానిలోని ఏడు గ్రామాల్లో మొత్తం 21 లే అవుట్‌లు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో 47 వేల మందికి పట్టాలు ఇవ్వనున్నారు. మే 17 నాటికి లే అవుట్‌లను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన 24 వేల మందికి 569.46 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించగా తొలి విడత 20,684 మందికి ఇవ్వడానికి పట్టాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కురగల్లు, నిడమర్రు, మందడం తదితర గ్రామాల్లో 11 లే అవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23 వేల మందికి 550 ఎకరాల్లో స్థలాలివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 20 వేల మందికి పట్టాలు ఇవ్వనున్నారు.
లేఅవుట్ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. రెవెన్యూ అధికారులు, ఇంజినీరింగ్, సర్వే, గృహ నిర్మాణ శాఖ అధికారులు లేఅవుట్‌ల రూపకల్పన, ఇళ్ల స్థలాల కేటాయింపు, మ్యాపింగ్ చేయడంలో నిమగమయ్యారు. పెదకాకాని, తుళ్లురు మండలాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 20 వేల మందికి ఇంటి స్థలాల పట్టాలను ఈనెల 17 తరువాత ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఐనవోలు గ్రామాల్లో 10 లేఅవుట్‌లలో పెదకాకాని, తుళ్లురు, మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు తరువాత జగనన్న కాలనీల్లో ఇళ్ల కేటాయింపునకూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం లే అవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఎన్‌టిఆర్ జిల్లాలోని ఆరు మండలాలు, గుంటూరు జిల్లాలోని నాలుగు మండలాలకు చెందిన 47వేల మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 40 వేలమందిని అధికారులు ఖరారు చేశారు.
హైకోర్టు తీర్పుపై ఎంపి సురేష్ హర్షం
ప్రజాశక్తి - తుళ్లూరు : పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి హైకోర్టు గ్రీన్ సిగల్ ఇవ్వడంపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉద్ధండ్రాయునిపా లెంలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి కడుపు నింపుతున్నారని అన్నారు. ఎన్నో శతాబ్దాలుగా ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారని, మరో 30 ఏళ్లు జగనే సిఎంగా ఉండాలని ఆకాంక్షించారు. బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం దీక్షలు చేసి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని బహుజన పరిరక్షణ సమితి నాయ కులు అన్నారు. కార్యక్రమంలో ఎం.గురు నాథం, పి.వరప్రసాద్, బి.రాజేంద్ర కుమార్, బి.శామ్యూల్, ఎన్.జోషి, బి.సాంబయ్య, ఇ.ఆదాం, పి.దాసు, ఐ.సుభాషిణి, రాజ్‌కుమార్, కె.పుష్పరాజ్ పాల్గొన్నారు.










