
చిలమత్తూరు : ఇళ్ల స్థలాల కోసం పేదలు పోరుబాట పట్టారు. ఏళ్ల తరబడి స్థలాల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలో భూస్వాధీన పోరాటం నిర్వహించారు. చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 805లో గురువారం ఉదయం గుడిసెలు వేసుకుని ఆందోళన నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా కోర్టు కేసు పేరుతో అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదల పక్షాన సిపిఎం నిలబడింది. గురువారం నాడు పేదలతో కలిసి సిపిఎం నాయకులు కోడూరు రెవెన్యూ పొలం 805లోకి వెళ్లి ఎర్రజెండాలు పాతారు. తక్షణం ఈ భూమిని పేదలకు పంచాలంటూ అక్కడే గుడిసెలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ పోరాటంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ చిలమత్తూరు మండల పరిధిలో దాదాపు 250 మందికి కోడూరు వద్ద ముద్దప్పల్లి సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించారన్నారు. అంతకు ముందు కొడికొండ చెక్‌పోస్టు వద్ద స్థలాన్ని కేటాయించిందన్నారు. తర్వాత లాలేపల్లి క్రాస్ వద్ద 805 సర్వే నెంబర్‌లో స్థలాలు ఇస్తామని చెప్పారన్నారు. ఈ స్థలాలు అన్నీ విలువైనవన్న భావనతో ప్రతిసారీ వాటిని రద్దు చేయడం, కొత్తవాటిని ఇస్తామని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. పేదలకు విలువైన ప్రదేశంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఏ చట్టం చెప్పిందో రెవెన్యూ అధికారులు చెప్పాలన్నారు. పేదలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ రకంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అర్హులను గుర్తించిన తర్వాత వారికి ఇళ్ల పట్టాలను ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. మూడు సంవత్సరాలుగా కోర్టుల పేరుతో కాలక్షేపం చేయడం దారుణం అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
అధికారులపై ఆగ్రహం
ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతానికి తహశీల్దార్ నాగరాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బంది చేరుకున్నారు. పేదలు, సిపిఎం నాయకులతో మాట్లాడారు. స్థలం వివాదం కోర్టులో ఉన్నందన్నారు. ఈ సమస్య పరిష్కారం కాగానే ముద్దప్పల్లి వద్దే స్థలాలను ఇస్తామని చెప్పారు. కోర్టు సమస్యల పేరుతో ఇంకెంతకాలం తమను మోసం చేస్తారంటూ పేదలు అధికారులను నిలదీశారు. పేదలకు విలువైన స్థలంలో ఎందుకు పట్టాలు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు. పేదలు ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అధికారులు వెళ్లిన అనంతరం కూడా సిపిఎం నాయకులు, పేదలు ఆ స్థలంలోనే ఉన్నారు. అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. చిన్నారులతో పాటు గుడిసెలు వేసుకుని ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్ కుమార్, వెంకటేష్, నల్ల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.