Aug 21,2023 20:18

వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు

వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు
ఇళ్ల స్థలాల కోసం భ.ని.కార్మిక సంఘం కలెక్టర్‌కు వినతి
ప్రజాశక్తి-నెల్లూరు:భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న పలు రకాల కార్మికులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం వినతిపత్రం అందజేసింది. సోమవారం 'స్పందన' కార్యక్రమానికి హాజరైన భవన నిర్మాణ కార్మిక సంఘం రూరల్‌ కార్యదర్శి కొండా ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికులు రోజువారి కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. వీరందరూ బాడుగ ఇళ్లల్లో కాపురం ఉంటున్నారని, రోజూవారి కూలికి వెళ్లే వీరందరూ ఇంటి బాడుగ కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నారన్నారు. మరో ప్రక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్న తరుణం, కరెంట్‌ ఛార్జీలు మరింత భారం కావడంతో భవన నిర్మాణ కార్మికుల జీవనం దారుణంగా ఉందన్నారు. వీరి సమస్యను ప్రభుత్వం తీసుకెళ్ళి భవన నిర్మాణ కార్మికలందరికీ 9 అంకణాల నివాస స్థలం మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా కొత్తూరు, శ్రీలంక కాలనీ, డైకాస్‌ రోడ్‌, జడ్పీ కాలనీ సమీపంలోని ఇందిరానగర్‌ కాలనీ, బి.వి.నగర్‌ తదితర ప్రాంతాల్లో కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు.
సమస్యపై సానుకూలంగా స్పందంచిన కలెక్టర్‌ భవన నిర్మాన కార్మికులు జీవనం సాగిస్తున్న ప్రాంతాల్లోని సచివాలయాల్లో వ్యక్తిగతంగా వినతిపత్రాలు అందజేయాలని, ఆధార్‌. రేషన్‌ కార్డ్‌. జిరాక్స్‌ అందజేసి నివాస స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నివాస స్థలం90 రోజుల్లో ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ నాయకులు ఎం మనీ. ఎం సురేష్‌. ఎన్‌ నందకుమార్‌. ఆర్‌ కుమార్‌. ఎం చెంచయ్య. రవి. తదితరులు పాల్గొన్నారు.