
ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని చెరుకుపల్లిలో 2019లో 122 మంది పేదలకు పట్టాలను ఇచ్చినా స్థలాలు అప్పజెప్పలేదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ తహశీల్దార్ బంగార్రాజుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 1లో సుమారు 122 మందికి అప్పటి తహశీల్దారు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని గుర్తుచేశారు. స్థలాల కోసం పలుమార్లు విన్నవించుకున్నా చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై కొంతమంది న్యాయస్థానానికి వెళ్లగా, పట్టాలు అప్పగించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో కొంతమందికి ఇచ్చి, మిగతా వారికి స్థలాలు చూపలేదని అన్నారు. ప్రభుత్వం తమకు నచ్చిన వారికి పట్టాలు మంజూరు చేసి, ఉద్దేశపూర్వకంగా పేదలకు ఇల్లు లేకుండా చేస్తున్నారని అన్నారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సరగడ తోగులురెడ్డి, పార్టీ నాయకులు తుపాకుల గురుమూర్తి, తాటిపూడి ఉదరు కుమార్, రిక్కా నరసింహులు పాల్గొన్నారు.