ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసి) పరిధిలోని ఆత్మకూరులోని నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్, వైఎస్‌ఆర్ కాలనీలకు, గ్రామంలోని వివిధ పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి ఇంటి పన్నులు వేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు నివాసితులు ఎంటిఎంసి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి యు.దుర్గారావు మాట్లాడుతూ ఆత్మకూరులో సుమారు 2 వేల కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభుత్వ పక్క గృహా పథకం, విద్యుత్, నీటి కుళాయి కనెక్షన్లు, సంక్షేమ పథకాలు తదితరాలకు అర్హత పొందలేకపోతున్నారని చెప్పారు. అర్హత పొందాలంటే ఇంటి పట్టా లేదా పన్ను తప్పనిసరి అని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వాటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ యు.శారదాదేవికి వినతిపత్రం ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శిని సంప్రదించి వివిధ ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని నివసించే వారికి ఏ రూపంలో పన్నులు వేయాలో పరిశీలించి పన్నులు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.అజరుకుమార్, సిహెచ్.సీతారామాంజనేయులు, బి.రాంబాబు, సిహెచ్.గిరిధరరావు, ఆనందం బాబ్జి, వి.సురేష్, ఎం.శ్రీను, కె.లక్ష్మి, జి.లక్ష్మి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.










