ప్రజాశక్తి- తగరపువలస చిట్టివలస జ్యూట్ కార్మికవాడలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న జ్యూట్ కార్మిక కుటుంబాలకు నివాసం ఉన్న చోటే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ, కార్మిక కుటుంబాలు ఉంటున్న జ్యూట్ క్వార్టర్ల స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని కార్మికులకు అప్పగించాలని కోరారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న జ్యూట్ కార్మికులను ఆక్రమదారులుగా చిత్రీకరించడం అధికారులకు తగదన్నారు. యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్ అప్పల నాయుడు మాట్లాడుతూ, కార్మికులకు క్వార్టర్ల స్థలాలు కేటాయించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.అనంతరం ఆర్‌డిఒ భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి బాబాజీ, ఎస్ అప్పారావు, మహిళలు పాల్గొన్నారు.










