ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పర్చుకున్న గిరిజనులందరికీ ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. 'ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి పట్టాలివ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలి' అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్నానుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ బుట్టాయగూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 614లో 4.94 ఎకరాల భూమిలో మండలంలో ఇంటి స్థలం లేని గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకుని రెండు నెలలుగా నివాసముంటున్నారన్నారు. ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న గిరిజనులకు హక్కు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు తమ సొంత గ్రామాల్లో ఇంటి స్థలాలు లేక ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబాలకుపైగా నివాసం ఉంటున్నాయని, అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గుడిసెలు వేసుకున్న గిరిజనులందరికీ హక్కు పట్టాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం తహశీల్దార్ ఎస్‌ఎస్.శాంతికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె స్పందించి మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు కారం భాస్కర్, కె.దుర్గారావు, ఎస్.దుర్గమ్మ, ఎం.గంగరాజు, తెల్లం మునియ్య, పలువురు గిరిజనులు పాల్గొన్నారు.










