పెనుకొండ : పెనుకొండలో ఇళ్లులేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. గత పది రోజలుగా పేదల ఇళ్ల పట్టాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు పోలీసుల చేత ఈ పోరాటాలను అణచివేసేందకు ప్రయత్నిస్తున్నా, నాయకులు వెనక్కు తగ్గడం లేదు. ఆందోళనల్లో భాగంగా సోమవారం నాడు పేదలతో కలిసి పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. పెనుకొండ డివిజన్ వ్యాప్తంగా పలు మండలాల్లో సిపిఎం, వ్యకాసం, ఇతర అనుబంధ సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు సిపిఎం నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ముందస్తు అరెస్టు చేశారు. రౖతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, సిపిఎం నాయకుడు వెంకటరాముడు, సోమందేపల్లి సిపిఎం మండల కార్యదర్శి రాజగోపాల్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య, చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి చాంద్ బాషా తదితరులను అరెస్టు చేసి మడకశిర, అమరాపురం, చిలమత్తూరు పోలీసు స్టేషన్లకు తరలించారు. పేదల కోసం పోరాటాలు చేస్తుండగా ఇలా అధికారులు ముందస్తు అరెస్టుల పేరుతో సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడంపై సిపిఎం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వండి
ఎమ్మెల్యేను కోరిన సిపిఎం నాయకులు
పెనుకొండలో సొంత ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ డిమాండ్ చేశారు. ఇళ్లులేని పేదలు సిపిఎం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం మధ్యాహ్నం పెనుకొండలో ఎమ్మెల్యే శంకరనారాయణ ఇంటి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో సొంత ఇళ్లు లేని పేదలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దార్, సబ్ కలెక్టర్, కమిషనర్, కలెక్టర్లకు పలుమార్లు అర్జీలు ఇచ్చారన్నారు. సచివాలయాల్లో సైతం అనేకమార్లు అర్జీలు ఇచ్చారన్నారు. అర్జీ ఇచ్చిన 90రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ పెనుకొండలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుంటే దానిని కూడా అధికారులు దౌర్జన్యంగా తొలగించడం దుర్మార్గంగా ఉందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంపై స్పందించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే శంకర నారాయణ స్పందిస్తూ ఇళ్ల పట్టాల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి పట్టాలు మంజూరు చేయించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిపిఎం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్.వెంకటేష్, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, నాయకులు సాంబశివ, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, తిప్పన్న, నరసింహా, హనుమయ్య, కొండా వెంకటేష్, వెంకటేష్, రంగప్ప పేదలు పాల్గొన్నారు.










