Jul 06,2023 23:22

మంగ‌ళ‌గిరి మండ‌లం కృష్ణాయ‌పాలెంలో లే అవుట్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మొండిచేయి చూపింది. కోర్టులో కేసులు తేలేవరకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కేంద్రం ప్రకటనతో ఇళ్ల నిర్మాణ వ్యవహారం అయోమయంలో చిక్కుకుంది. లబ్ధిదారులకు తమ పరిస్థితి ఏమిటన్నదీ అంతుబట్టడం లేదు.
రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈనెల 8న తాను శంకుస్థాపన చేస్తానని సిఎం జగన్‌ గతనెల 26న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు గత నెల రోజులుగా జిల్లా అధికారులు హడావుడి చేశారు. దాదాపు నెలరోజులపాటు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ జరిగింది. వారంలోగా పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సిఎం జగన్‌ ఆదేశించినా నెల రోజుల్లో 45 వేల మందికి పట్టాలు పంపిణీ చేశారు. గతనెల 26న పట్టాల పంపిణీకి ముందే రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ఈ మేరకు 47 వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇళ్ల నిర్మాణం శంకుస్థాపనకు హడావుడి చేసింది. జిల్లా అధికారులను పరుగులు పెట్టించింది. తీరా వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి తాఖీదు అందింది. స్థలాల పంపిణీపై కోర్టులో కేసులు ఉన్నందున ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని, కోర్టులో కేసులు తేలిన తరువాత ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయితేనే నిధులు ఇవ్వగలమని పేర్కొంది.
వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించినా చివరి దశలో కార్యక్రమం మొత్తం వాయిదా పడింది. సిఎం జగన్‌ ఈనెల 8న రాజధాని ప్రాంతానికి రావాల్సి ఉన్నా ఆయన పర్యటనలో ఈ అంశం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణం ఇప్పట్లో లేనట్టేనని అధికారులు భావిస్తున్నారు. సిఆర్‌డిఎ పరిధిలోని ఆర్‌-5 జోన్‌óతో పాటు గృహనిర్మాణాలకు కేటాయించిన ఎస్‌-3జోన్‌ భూముల్లో కూడా పేదలకు ఇళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మొత్తం 25 లేవుట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 50,793 మందికి పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిల్లో 90 శాతం మందికి పట్టాలు ఇచ్చారు. మిగతా వారికి ఇంకా ఇవ్వలేదు.
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జగనన్న కాలనీల్లో మాదిరిగానే వాలంటీర్ల ద్వారా గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. మొదటి ఆప్షన్‌లో సొంతంగా ఇల్లు కట్టుకుంటే లభ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా రూ.1.80 లక్షలు జమచేస్తారు. రెండో ఆప్షన్‌గా ఇంటి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ అందించడంతో పాటు కూలీల ఖర్చును బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడంగా పేర్కొన్నారు. అయితే దాదాపు 70 శాతం మంది లబ్ధిదారులు మూడో ఆప్ఫన్‌కు మొగ్గుచూపారు. ప్రభుత్వం నిర్ధేశించిన సొమ్ముకు ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని, పునాదులకే ఎక్కువ ఖర్చు అవుతుందని అందువల్ల ప్రభుత్వమే ఇళ్లనిర్మాణం చేపట్టాలని మూడో అప్షన్‌ వైపు ఆసక్తి కనబర్చారు. తీరా ఇళ్ల నిర్మాణం జరగడంలేదని తెలిసి లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేగాక ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు ప్రభుత్వ న్యాయవాదుల నుంచి స్పష్టమైన సమాధానం రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ కేసును హైకోర్టు ఈనెల 11కు వాయిదా వేసింది.