
ప్రజాశక్తి -కశింకోట
జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. అచర్ల, గొకివానిపాలెం, మోసయ్యపేట గ్రామంలో జగనన్న లే ఆవుట్లను పరిశీలించారు. ఎంతమంది కడతన్నారు, ఎంత మంది కట్టడం లేదో అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలవారీగా జరుగుతున్న ఇల్లు నిర్మాణం పనులు, వారికి మంజూరు చేసిన స్థలాలపై చర్చించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. ఏయే పనులు జరుగుతున్నాయి, ఎంత గిట్టు బాటు వస్తుందో అడిగి తెలుసుకున్నారు. చింతలపాలెంలో భూమి ఆక్రమణకు గురుకాకుండా సర్వే రాళ్ళు పాతాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ రోజారాణి, ఎంపిడిఒ కొంకి అప్పారావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్ సురేష్ నాయుడు, హౌసింగ్, రెవెన్యూ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం పరిశీలన
కశింకోటలోని బాలురు, బాలికలు హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంపై ఆరోపణలు రాకుండా ఉపాధ్యాయులు, ఇన్విజలేటర్లు వ్యవహరించాలని సూచించారు.