Jun 07,2023 19:39

మండల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న వేణుగోపాల్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయడంలో అలసత్వం వహిస్తున్నారని హౌసింగ్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులపై మండల ప్రత్యేకాధికారి, సర్వశిక్ష అభియాన్‌ పిఒ డాక్టర్‌ వేణుగోపాల్‌ మండిపడ్డారు. బుధవారం మండల కార్యాలయంలో తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సివి.కొండయ్య ఆధ్వర్యంలో జగనన్న కాలనీల ప్రోగ్రెస్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో చిప్పగిరి మండలం చాలా వెనుకబడి ఉందని కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చకపోతే నోటీసులు అందజేస్తామని హెచ్చరించారు. వారానికోసారి వస్తున్నాడు, పోతున్నాడని అనుకోవద్దని, తనకు కావాల్సింది లక్ష్యం చేరుకునేలా ఇంటి నిర్మాణాల ప్రోగ్రెస్‌ ఉండాలని తెలిపారు. ఇఒఆర్‌డి సంజన, పంచాయతీరాజ్‌ ఎఇ సోలా రెడ్డి, ఎంఇఒ మస్తాన్‌ రావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రామనీల, ఎపిఒ మాధవ శంకర్‌ పాల్గొన్నారు.