Apr 18,2023 23:49

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు:ఇళ్ళ పథకం లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి హాలులో కలెక్టర్‌ ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జిఎంసి కమిషనర్‌ కీర్తీ చేకూరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలమైన వాతవరణం ఉన్నందున నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నీటి సౌకర్యం కల్పించేలా మున్సిపల్‌, పబ్లిక్‌హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్‌లలో బోర్లు మరమ్మతులకు గురైతే వెంటనే చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. తెనాలిలోని బుర్రిపాలెం, నేలపాడు లేఅవుట్‌లలో ఉన్న కొద్దిపాటి నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. లేఅవుట్‌లలో నిర్మాణ సామగ్రి, ఇతర పరికరాలు రాత్రి వేళల్లో చోరీలు జరగకుండా నైట్‌ వాచ్‌మెన్‌లను నియమించు కోవాలన్నారు. నిర్మాణాలను ఎప్పటికప్పుడు బిల్లుల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. తెనాలి పరిధిలో నిర్మిస్తున్న ఇళ్ళ బేస్మేంట్‌ ఫిల్లింగ్‌కు అవసరమైన ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా తెనాలి సబ్‌కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జిఎంసి పరిధిలోని ఇళ్ళ బేస్మేంట్‌ ఫిల్లింగ్‌కు అవసరమైన గ్రావెల్‌ సమీప ప్రాంతాల నుంచి సరఫరా చేసేలా చూడాలని, ఆర్‌డిఒ, తహశీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ సాయినాధకుమార్‌, ఆర్డీవో ప్రభాకరరెడ్డి, తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు, మెప్మా పీడీ వెంకట నారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.