Aug 03,2023 21:08

- బాధితులతో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాజంపేట అర్బన్‌ : అన్నమయ్య ప్రాజెక్టు వరద పీడిత గ్రామాలైన పులపతూరు, తోగురుపేట, మందపల్లె గ్రామాల్లో బాధితుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అందజేసేందుకు గహ నిర్మాణ శాఖ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. గురువారం అన్నమయ్య ప్రాజెక్టు వరద గ్రామాలైన పులుపుతూరు గ్రామాన్ని ఆయన సందర్శించి అక్కడ బాధితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా తమకు ఇంత వరకు ఒక్క ఇళ్లను కూడా పూర్తిగా నిర్మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎండకు, వానకు, చలికి నానా అవస్థలు పడుతున్నామని జెసి దష్టికి తీసుకువచ్చారు. ఇంటి ముందు ఆరడుగుల మేర సన్‌ సైడ్‌ బండను నిర్మించి ఇవ్వాలని కాంట్రాక్టర్ను పలుమార్లు ప్రాధేయపడినా తాను నిర్మించి ఇవ్వనని, ప్రభుత్వం చెప్పిన నిబంధన ప్రకారం ఆ కొలతల ప్రకారమే ఇళ్లను నిర్మించి ఇస్తానని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరడుగుల మీద సన్‌ సైడ్‌ బండ వేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తాన్ని బాధితులే భరిస్తామని తెలిపారు. పనిలో పనిగా ఆ బండను ప్రతి ఇంటికి కాంట్రాక్టర్‌ నిర్మించి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ దష్టికి బాధితులు తీసుకొచ్చారు. స్పందించిన జెసి ఈ విషయాన్ని కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో చర్చించి చర్యలు చేపడతామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి, గహ నిర్మాణ శాఖ ఇఇ కుప్పుస్వామి, డిఒ మురళి, ఆర్‌డిఒ కార్యాలయ సిసి కిరణ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.