Aug 31,2023 21:43

పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస వద్ద గల జగనన్న కాలనీని పరిశీలిస్తున్న హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి మైదీన్‌

ప్రజాశక్తి - పార్వతీపురం: జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అంకిత భావం ప్రదర్శించి, ప్రతిభ కనబరిచి, పూర్తి చేసిన వారికి ప్రత్యేక అవార్డులు అందజేస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఉత్తరాంధ్ర ప్రత్యేక అధికారి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన హౌసింగ్‌ అధికారులు, ఎంపిడిఒలు, ఇంజినీరింగ్‌ సహాయకులు, సంబంధిత అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటికే 5 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, డిసెంబరు నాటికి అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున సాగుతున్న గృహ నిర్మాణాల్లో అవార్డుల సాధనకు ప్రయత్నించాలని సూచించారు. ఈ జిల్లాలో ప్రగతి బాగుందని ఆయన ప్రశంసించారు. జిల్లాలో మంజూరైన అన్ని గృహాలు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గృహాల నిర్మాణ స్థాయి మారడం మాత్రమే కాదని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి కాలనీలో ఇంకుడు గుంతలు ఉండాలని, 25 గృహాలు దాటి ఉన్న కాలనీలకు అర్చ్‌ల నిర్మాణం ఉండాలని తెలిపారు. బిల్లులను నిర్దేశిత సమయంలో అప్‌ లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ సహాయకులు పనులపై శ్రద్ద వహించాలని, సహాయ ఇంజినీర్లు బాధ్యతతో పర్యవేక్షణ చేయాలని సూచించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వస్తున్న ఆర్జీల పరిష్కారంలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పిఎంఎవై గ్రామీన్‌కు ముందస్తుగానే రూ.40 వేలు అందిస్తున్నామని చెప్పారు. ప్రగతిలో వెనుకబడిన మండలాలు నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులను ప్రేరేపించి నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పారు. జిల్లాకు 27,142 ఇళ్లు మంజూరు కాగా, 23,805 ఇళ్ల నిర్మాణం చేపట్టామని, 11,844 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. పునాదుల స్థాయిలో 5227, రూఫ్‌ స్థాయిలో 1774, రూఫ్‌ కాస్టింగ్‌ స్థాయిలో 346 ఉన్నాయి. పునాదుల పూర్తి అయ్యే స్థితిలో 4614 ఉన్నాయని వివరించారు. కాలనీల్లో రూ.5కోట్లతో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సెప్టెంబర్‌ నెలాఖరుకు 2వేల ఇళ్లు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాబోయే 3, 4 రోజుల్లో వంద ఇళ్లు పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.63 లక్షలు విడుదల చేశామన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి తీర్మానాలు శత శాతం సోమ వారం నాటికి అందాలని ఆయన చెప్పారు. సమావేశంలో జెస్‌ి ఆర్‌.గోవింద రావు, హౌసింగ్‌, డిఆర్‌డిఎ పీడీలు టి.రమేష్‌, పి.కిరణ్‌కుమార్‌, జిల్లా ఆర్‌డబ్ల్యు.స్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకర రావు, మున్పిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, ఇంజినీరింగ్‌ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : అనంతరం పట్టణంలోని కొత్తవలసలో గల గ్రీన్‌ఫీల్డ్‌ జగనన్న కాలనీ లే అవుట్‌, వెంకంపేట వద్ద ఉన్న జగనన్న లేఔట్‌లో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడుతో కలిసి పరిశీలించారు. కాలనీల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని సూచించారు. పరిశీలనలో డిఇ, ఎఇ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.