ప్రజాశక్తి - ఏలూరు టౌన్
జగనన్న ఇళ్ల నిర్మాణాల ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పనపై గృహ నిర్మాణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని నగర్ కమిషనర్ షేక్ షాహిద్ తెలిపారు. చోదిమెళ్లలోని ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులతో కలిసి శనివారం కమిషనర్ ఇళ్ల కాలనీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ షాహిద్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బేస్‌మెంట్ స్థాయిలోనే ఎగుడు దిగుడు లేకుండా క్రమ పద్ధతిలో సమాంతరంగా నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వహకులకు కమిషనర్ సూచించారు. రెండు పూటలా ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ వాటరింగ్ చేస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారుల నుండి ఫిర్యాదు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను, ఏజెన్సీల నిర్వాహకులను కమిషనర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన బ్రిక్స్, ఐరన్, ఇసుక, సిమెంట్ కొరత లేకుండా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరితన పూర్తయ్యేందుకు అధికారులు సచివాల సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణాలపై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులను కమిషనర్ షాహిద్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్, గృహ నిర్మాణ శాఖ డిఇ సుధారాణి, విద్యుత్ శాఖ ఎఇ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఎఇ రఫీ, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మాధవి, సచివాలయ, హౌసింగ్, ఇంజినీరింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.










