ప్రజాశక్తి -గోపాలపట్నం : ఇళ్ల మరమ్మత్తుల కోసం ఈవోకు ఎందుకు దరఖాస్తు చేసుకోవాలని సిపిఎం గోపాలపట్నం డివిజన్ కమిటీ కార్యదర్శి బలివాడ వెంకటరావు ప్రశ్నించారు. గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 23 సంవత్సరాలుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల పంచ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటి మీద రేకుల షెడ్డు వేసుకోనీయడంలేదని, చివరకు కాలిపోయిన పూరిపాక స్థానంలో రేకుల షెడ్డు కూడా కట్టుకోనీయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన స్కీమ్ ఇళ్లను కూడా కట్టుకొనివ్వట్లేదన్నారు. దేవస్థానం భూ సమస్య కోర్టు పెండింగ్‌లో ఉన్నందున, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కంటితుడుపు చర్యల్లో భాగంగా ఇంటి మరమ్మతుల కోసం సింహాచలం ఈవోకు దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణీయం కాదని పేర్కొన్నారు. ఈ భూ వివాదాన్ని కోర్టులకు వదలకుండా అన్ని తరగతులు, వర్గాలు, ఈ సమస్యపై 23 సంవత్సరాలుగా పోరాడుతున్న సంఘాలు, రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించి జన ఆమోదమైన పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు, ఎవరికీ దరఖాస్తులు చేసుకోకుండా ఇళ్ల మరమ్మత్తుకు అనుమతించాలని కోరారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.విజయలక్ష్మి బి.రమణి, ముద్దాడ వరప్రసాద్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.