ప్రజాశక్తి - నకరికల్లు : ఫీల్డ్ అసిస్టెంట్‌లు విధులు సక్రమంగా నిర్వహించకపోతే విధుల నుండి తొలగిస్తామని డ్వామా పీడీ జి.జోసెఫ్‌కుమార హెచ్చరించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ చట్టం కింద చేసిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. మండలంలో 1,85,000 పని దినాలకుగాను రూ.4.90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గ్రామాల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్‌ల నుండి సమాచారం సేకరించారు. సాంకేతిక అనుమతులు లేకుండా గ్రామాల్లో పనులు నిర్వహించిన వారిపై అపరాధ రుసుం విధించారు. రిజిస్టర్లు రికార్డులు పరిశీలించారు. మండల పరిధిలో సుమారు 465 ఇళ్ల నిర్మాణం జరిగిందని, వాటికి 90 రోజుల ఉపాధి హామీ నిధులు రూ.కోటి పైచిలుకు నగదు జమ చేయడంలో సిబ్బంది విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాపిశెట్టిపాలెంలో 122 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఆధార్ అప్డేట్ కాక తొలగించిన విషయం తెలిసి రెండ్రోజుల్లోపు వాటిని పూర్తి చేయాలని కుంకలగుంట ఫీల్డ్ అసిస్టెంట్ కోటేశ్వరరావును ఆదేశించారు. ఉపాధి హామీ సిబ్బంది పనితీరు నచ్చకపోవడంతో నరసింగపాడు, తురక పాలెం ఫీల్డ్ అసిస్టెంట్లు మినహాయించి ఏపీవో రామకృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ సైదమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా నోటీసుకు సమాధానం చెప్పకపోతే అపరాధ రుసం విధిస్తామన్నారు. రూ.40360 రికవరీకి ఆదేశించారు. రూ.50670 ఏపీడీ రికవరీ కట్టాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి టి.వెంకట విజయలక్ష్మి, ఎంపిడిఒ బి.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ పి.అంజమ్మ, వెంకటేశ్వరరావు, టిఎలు గోపీకృష్ణ, కృష్ణకుమారి పాల్గొన్నారు.










