వెళ్లే ముందు అమ్మకు ఫోన్ చేసి, ట్రైన్ ఎన్నింటికి వస్తుందో కనుక్కొన్నాడు. ఆటో తీసుకొని ఇంటికి రమ్మని కూడా ఆమెకు చెప్పాడు. 7 గంటలకు ఇంటికి చేరిన నజీమాకు పోలీసుల నుండి ఫోన్ వచ్చింది, తన కొడుకు శవం రైలు పట్టాల మీద ఉందని. శవాన్ని చూసిన సమీర్, అతని చేతులు వెనక్కి కట్టేసి ఉండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. మొండెం, తల వేరుబడి ఉన్నాయి. పోలీసులు వారిస్తున్నా వినకుండా ఫోటోలు తీశాడు సమీర్. ఆ ఫోటోలే ఇప్పుడు కీలక సాక్ష్యాలు అయ్యాయి. అలాగే అర్బాజ్ ఫోన్ కాల్ లిస్ట్ కూడా. రామ సేన హిందూస్తాన్ నుండి వచ్చిన అనేక కాల్స్ ఆ ఫోన్ లో రికార్డ్ అయి ఉన్నాయి.
ఆరు సంవత్సరాల చిన్నారి పాప అత్యాచారం, హత్యా ఎంత దిగ్భ్రాంతికి గురి చేసాయో, దాని శిక్షగా రైలు పట్టాల మీద కనిపించిన ఛిద్రమైన నిందితుడు రాజు మృతదేహాన్ని చూసి అంతే కలవర పడాల్సి వచ్చింది. ఒక నేరానికి సమాధానంగా ఇంకో నేరాన్ని చేసి చూపించారు పోలీసులు. ఇది తాత్కాలికంగా మన మీడియానూ, దాని ద్వారా ప్రజల ఆత్మను శాంతింపచేసింది. కానీ రాజ్యం చేస్తున్న హత్యలకు మీడియా సమకూరుస్తున్న ఆమోదం క్రమంగా రాజ్యం పెంచి పోషిస్తున్న కొన్ని సంస్థల వరకూ పాకుతుందనీ, తరువాత కాలంలో ఆ నేర ప్రవృత్తి సామాన్య ప్రజల్లో కూడా వ్యవస్థీకృతం అవుతుందనీ, దాని పర్యవసానాలు అతి దారుణంగా ఉండబోతున్నాయనీ గ్రహించాలి. ఆ పర్యవ సానాలు ఇప్పటికే కనబడుతున్నాయి. హిందూ త్వాన్ని పుణికి పుచ్చుకొన్న ప్రభుత్వం తరఫున, దానికి కొమ్ము కాస్తున్న సంస్థలు అలాంటి హత్యలనే చేస్తున్నాయి.
'ద న్యూస్ మినిట్' అనే వార్తా సంస్థ విలేకరి ప్రజ్వల్ భట్ కర్ణాటక లోని బెలగావి జిల్లాలో జరిగిన 24 సంవత్సరాల యువకుడి హత్య గురించి అనేక వ్యాసాల్లో వివరంగా రిపోర్ట్ చేశాడు. 'ఇలాంటి నేరస్త ప్రపంచానికి వచ్చి, ఇన్ని ప్రమాదకర ప్రతికూల శక్తుల మధ్య రిపోర్టింగ్ చేయటం అంటే చిన్న విషయం కాదు. మేము చేస్తున్న ఈ పనికి మీ మద్దతు లేకపోతే, మేము కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది' అని ప్రజ్వల్ భట్ పాఠకులను ఉద్దేశించి అన్నాడు.
ద న్యూస్ మినిట్, ఇంకా ఇతర వార్తా సంస్థల ద్వారా ఈ హత్యకు సంబంధించి వచ్చిన సమాచారం అత్యంత వ్యాకుల పరుస్తోంది. అర్బాజ్ అఫ్తాబ్ అనే 24 సంవత్సరాల సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువకుడు తన తల్లి నజీమా షేక్ తో కర్ణాటక బెలగావి జిల్లా ఖానాపూర్‌లో నివసిస్తున్నాడు. టైలర్ గా పని చేసే అతని తండ్రి 2017లో మరణించాడు. నజీమా స్కూల్ టీచర్ గా పని చేస్తారు. ఏరోనాటిక్ ఇంజినీర్ అయిన ఆమె కూతురు భర్తతో వేరే దేశాల్లో ఉంటోంది.
ఇంజినీరింగ్ పూర్తి అయిన అర్బాజ్ పాత కార్లు అమ్మీ కొనే కాంట్రాక్టులు చేస్తున్నాడు. అతనికి రెండు సంవత్సరాలుగా తమ ఇంటికి దగ్గరలో నివసించే ఒక హిందూ అమ్మాయితో ప్రేమ సంబంధం ఉంది. ఆ విషయం ఇరు కుటుంబాలకూ, ఇరుగు పొరుగుకూ, మొత్తం ఖాన్ పూర్ ప్రజలకూ తెలిసాక అతని తల్లి అతన్ని అందులో నుండి బయటకు రమ్మని హెచ్చరించింది. అమ్మాయి కుటుంబానికి కూడా ఆమె ఈ విషయం చెప్పి, వాళ్ల పాపను జాగ్రత్త చేసుకోమని చెప్పింది. ఆమెకు తెలిసిన, చేయగలిగిన పరిష్కారం అదే. అమ్మాయి కుటుంబం నుండి బెదిరింపులు రావటం, అర్బాజ్ తన మాట వినకుండా ఆ బాలికను రహస్యంగా కలుస్తుండటంతో వాళ్లు మూడు సార్లు ఇళ్లు మారాల్సి వచ్చింది.
ఈ విషయం ఇలా నలుగుతుండగానే, 'రామ సేన హిందూస్తాన్' అనే హిందుత్వ సంస్థ నుండి వాళ్లకు పిలుపు వచ్చింది. 'రామ సేన హిందూస్తాన్' సంస్థ 'రామ సేన' సంస్థ నుండి విడిపోయి ఏర్పడినది. ఈ సంస్థ వాళ్లు, వీళ్ల ప్రేమ సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి పిలిచారు. సెప్టెంబర్ 26న తల్లి కొడుకులు వాళ్లను కలవటానికి వెళ్లారు. వేలమంది మధ్యన పంచాయితీ జరుగుతుందని వాళ్లు ముందు చెప్పి ఉండటానా, అక్కడ కేవలం ముగ్గురే ఉండటం నజీమాను ఆశ్చర్యపరిచింది.
ఖాన్‌పూర్ తాలూకా శాఖ సభ్యులైన పుండాలిక్ ముట్గెకర్, ప్రశాంత్ బిర్జీ, వాళ్లకు తెలియని ఒక ముస్లింనూ వాళ్లు అక్కడ కలిశారు. ఆ అమ్మాయితో సంబంధం వదులుకోమని వాళ్లు అర్బాజ్ ను బెదిరించారు. అప్పటికప్పుడు 7000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్బాజ్ తన దగ్గర ఉన్న 500 ఇచ్చాడు. అతని ఫోన్ నుండి అమ్మాయి ఫోటోలను డిలీట్ చేయించారు. సిమ్ కార్డ్ ను కూడా ధ్వంసం చేశారు.
'నా మీద ఇప్పటికే 40 కేసులు ఉన్నాయి. ఇంకొకటి పెరిగితే నాకు పెద్ద నష్టం లేద'ని మహరాజ్ అని చెప్పుకొంటున్న పుండాలిక్ హెచ్చరించాడు. తమ మాట వినక పోతే అర్బాజ్ ముఖం మీద యాసిడ్ పోస్తామని కూడా బెదిరించారు. తమను ప్రశాంతంగా బతకనివ్వమని నజీమా వారిని కోరింది. ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులను తరువాత పంపమని వాళ్ల ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. అంటే మొత్తంగా వాళ్లు కోరింది హిందూ బాలికతో సంబంధాలు తెగతెంపులు చేసుకొని, వాళ్లకు డబ్బులు సమర్పించుకోమని. మొదట రూ. 7000తో మొదలు పెట్టి ఆ రెండు రోజుల్లోనే ఆ మొత్తాన్ని రూ. 90000కు పెంచారు.
అంత డబ్బును సమకూర్చుకోవటానికి అర్బాజ్ వాళ్ల పాత వెంటో కారుని సెప్టెంబర్ 27న అమ్మేశాడు. ఐఫోన్ కూడా అమ్మాల్సి వస్తుందని తన కజిన్ సమీర్ తో అన్నాడు
అక్కడ నుండి వచ్చాక సెప్టెంబర్ 28న నజీమా తన పాస్‌పోర్ట్ విషయం తెలుసుకోవటానికి గోవా వెళ్లింది. అదే రోజు రామ సేన హిందూస్తాన్ పిలుపును అందుకొని సాయంత్రం 6 గంటలకు అర్బాజ్ ఇంటి నుండి బయలుదేరి వెళ్లాడు. తన రెండు సెల్ ఫోన్లనూ అమ్మమ్మ దగ్గర పెట్టి, ఒక చిన్న ఫోనుతో అక్కడికి వెళ్లాడు. వెళ్లే ముందు అమ్మకు ఫోన్ చేసి, ట్రైన్ ఎన్నింటికి వస్తుందో కనుక్కొన్నాడు. ఆటో తీసుకొని ఇంటికి రమ్మని కూడా ఆమెకు చెప్పాడు. 7 గంటలకు ఇంటికి చేరిన నజీమాకు పోలీసుల నుండి ఫోన్ వచ్చింది, తన కొడుకు శవం రైలు పట్టాల మీద ఉందని.
శవాన్ని చూసిన సమీర్, అతని చేతులు వెనక్కి కట్టేసి ఉండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. మొండెం, తల వేరుబడి ఉన్నాయి. పోలీసులు వారిస్తున్నా వినకుండా ఫోటోలు తీశాడు సమీర్. ఆ ఫోటోలే ఇప్పుడు కీలక సాక్ష్యాలు అయ్యాయి. అలాగే అర్భాజ్ ఫోన్ కాల్ లిస్ట్ కూడా. రామ సేన హిందుస్తాన్ నుండి వచ్చిన అనేక కాల్స్ ఆ ఫోన్ లో రికార్డ్ అయి ఉన్నాయి.
బెలగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ డాక్టర్స్ చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అర్బాజ్ మరణం హత్యగా తేలింది. అతని శరీరం మీద గాయాలు అతని మరణానికి ముందే చేసినవని చెప్పారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య అయ్యే అవకాశం లేదని చెప్పారు. ఈ కేసును పది రోజుల తరువాత మర్డర్ కేసుగా నమోదు చేశారు. అక్టోబర్ 4న అమ్మాయి తల్లిదండ్రులతో సహా ఈ కేసులో పది మందిని అరెస్టు చేశారు. అందులో మహారాజ్ కూడా ఉన్నాడు.
పుండాలిక్, ప్రశాంత్ లు తమ సంస్థ సభ్యులేనని బెలగావి జిల్లా రామ సేనా హిందూస్తాన్ సంస్థ అధ్యక్షుడు రామనాధ్ కొండూస్కర్ చెప్పాడు.
రామసేనా హిందూస్తాన్ సంస్థ తన కార్యకలాపాలను 2006లో ప్రారంభించింది. హిందూ సమాజాన్ని క్రమబద్ధం చేయటం, పటిష్టం చేసుకోవడం, దానికి సేవ చేసుకోవడం తమ లక్ష్యాలని తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొన్నది. ఈ సంస్థకు ఎఫ్.బి లో ప్రస్తుతం 11000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. దానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీల్లో శాఖలు ఉన్నాయని అదే పేజీలో రాసుకొన్నది.
ఈ క్రూర నేరస్తులను అరెస్టు చేయకుండా పోలీస్ మీనమేషాలు లెక్కబెడుతూ, వాళ్లకు ఆమోదం ప్రకటిస్తూ ఉండగా -ఇంకో పక్క నజీమాను పలకరించే వాళ్లే కరువయ్యారు. ఆమె, ఆమె కొడుకు ఏదో పెద్ద నేరం చేసినట్లు ఇరుగు పొరుగు ఆమెను సాంఘీకంగా వెలి వేశారు. ప్రేమించాడనే ఒకే ఒక కారణంతో హత్యకు గురి అయిన తన ఏకైక కొడుకు కోసం బెంగటిల్లుతున్న నజీమాను అక్కున చేర్చుకొనే సమాజమే కరువయిన ఈ దేశానికి భవిష్యత్తు ఉందా?
ఈ ప్రశ్న పెసిమిస్టిక్ గా కనిపించవచ్చు. కానీ ఇలాంటి హత్యలకు ఏవో కొన్ని ముస్లిం సంస్థలు, కొంత ప్రగతిశీల మీడియా తప్ప సభ్య సమాజం స్పందించనంత కాలం నా ప్రశ్నకు ప్రాసంగికత ఉంటుంది. ఇలాంటి హత్యల గురించి రాయనవసరం లేని రోజు కోసం గొంతెత్తుదాం.
( ఫేస్‌బుక్ వాల్ నుంచి )
రమా సుందరి










