Oct 16,2023 21:44

తీవ్ర పని ఒత్తిడితో ఉపాధ్యాయులు సతమతం
బోధనేతర పనుల భారమే అధికం
ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూపులు
తీవ్ర నిరాశ, నిస్పృహాల్లో 12 వేల మంది ఉపాధ్యాయులు
ప్రజాశక్తి - భీమవరం

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర పని ఒత్తిడితో ఆందోళనకు గురవుతున్నారు. బోధన కంటే ఇతర పనుల భారం ఎక్కువ కావడంతో మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన జీతాల నుంచి మిగిలిన అన్ని సౌకర్యాల్లోనూ కోతలు విధిస్తున్నారు. చివరకు ప్రతి నెలా జీతాలకు సైతం రోజులు తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 2500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 12 వేల మంది వరకూ ఉపాధ్యాయులు ఉన్నారు. బోధన కంటే ఇతర పనుల భారం వీరిపై అధికం కావడంతో గత రెండు, మూడేళ్లుగా చాలామంది ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నారు. సమయానికి కనీసం జీతాలు కూడా సర్కారు ఇవ్వకపోవడంతో ఆర్థికంగానూ అవస్థలు పడాల్సి వస్తోంది. విద్యార్థులకు బోధన విషయంలో ఎంత ఒత్తిడినైనా ఆనందంగా స్వీకరించే గురువులపై యాప్‌లు, జిఇఆర్‌లు, ముఖ గుర్తింపుతో అదనపు భారం పెంచేయడంతో కుంగిపోతున్నారు.
అన్నింటా కోతలే
ఉపాధ్యాయులకు అందించే జీతాల నుంచి అన్ని సౌకర్యాల్లోనూ ప్రభుత్వం విపరీతంగా కోతలు విధిస్తోంది. ఇంటి అద్దెలోనూ కోత వేశారు. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) కూడా 20 శాతం ఉంటే 16 శాతానికి, 15 శాతం ఉన్న వాళ్లకు 12 శాతానికి, 12 ఉన్న వాళ్లకు 10 శాతానికి తగ్గించారు. నగరాలు, మున్సిపాల్టీలు, గ్రామాల్లో పని చేసే వారందరికీ గతంలో ఉన్న హెచ్‌ఎస్‌ఎలో కోత వేశారు. ఉదాహరణకు రూ.15 వేల హెర్‌ఆర్‌ఎ ఉంటే అది రూ.12,500కు తగ్గిపోయింది.
సెలవుల డబ్బులూ ఇవ్వట్లేదు
ఉపాధ్యాయులు ఇఎల్‌ను సరెండర్‌ లీవుగా చేసుకుని డబ్బుగా మార్చుకుంటారు. అయితే ఉపాధ్యాయులకు గత ఏడాదిన్నర నుంచి సరెండర్‌ లీవు క్యాష్‌ మంజూరైనా బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు పడలేదు. (రూ.50 వేల జీతం ఉన్న ఉపాధ్యాయులు 15 రోజులు సరెండర్‌ లీవులు పెడితే రూ.25 వేల వరకూ డబ్బులొస్తాయి.) ఒక ఉపాధ్యాయుడికి జీతాన్ని బట్టి ఎన్ని రోజులు సెలవులు సరెండర్‌ చేస్తే అంత జీతం అదనంగా ఇస్తారు. ఇవేమీ పూర్తిస్థాయిలో వస్తున్న పరిస్థితి లేదు.
హాజరుకు అష్టకష్టాలు
ప్రస్తుతం ఉపాధ్యాయులకు వారి మొబైల్‌ ఫోన్లలోనే ముఖగుర్తింపు యాప్‌ను అప్‌లోడ్‌ చేశారు. అయితే ఉదయం, సాయంత్రం దీనిలో హాజరు వేసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. ఒకేసారి ఉపాధ్యాయులంతా హాజరు వేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. కనీసం 20 నిమిషాలు ప్రయత్నిస్తేనే హాజరు పడుతోంది. ఏమాత్రం పడకపోయినా షోకాజ్‌ నోటీసులు వస్తున్నాయని గురువులు వాపోతున్నారు. పాఠశాల వదిలేసిన తర్వాత కూడా అక్కడే ఉండి హాజరు వేసుకుని వెళ్లేందుకు సెల్‌ఫోన్లతో కుస్తీలు పడుతున్నారు.
యాప్‌లతో మరింత పని ఒత్తిడి
మధ్యాహ్న భోజనం యాప్‌లో ప్రతిరోజూ వండిన ఆహార పదార్థాలను ఉపాధ్యాయుని ఫొటోతో సహా అప్‌లోడ్‌ చేయాలి. గురువులకు ఇప్పుడు ఇదొక భారం. ఆహారం సరిగా లేకపోతే అప్‌లోడ్‌ చేసిన వాళ్లే బాధ్యులు. మరుగుదొడ్ల నిర్వహణ ఫండ్‌ (టిఎంఎస్‌) యాప్‌లో ప్రతిరోజూ పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేసే ఈ యాప్‌లో ఒక్కోసారి అంతా బాగున్నా బాగోలేదంటూ చూపిస్తోందని, షోకాజ్‌ నోటీసులు వస్తున్నాయని గురువులు వాపోతున్నారు.
జీతాల కోసం రోజులు తరబడి ఎదురుచూపులు
వివిధ రకాల పనులతో సతమతమవుతూ పని భారంతో నెలంతా పని చేస్తున్నా ప్రతినెలా ఇచ్చే జీతాల కోసం ఉపాధ్యాయులు రోజులు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రతి నెలా ఉత్పన్నమవుతోంది. ఆగస్టుకు సంబంధించిన జీతాలు సెప్టెంబరు 12వ తేదీ దాటినా పూర్తిస్థాయిలో పడలేదు. జూన్‌ 10వ తేదీతో ఉపాధ్యాయుల బదిలీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు గత మూడు, నాలుగు నెలలుగా జీతాలందలేదు.
పెంచాల్సింది.. తగ్గించడంతో..!
ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇచ్చిన ప్రభుత్వం ఇదేనంటూ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 27 శాతం, ఆపైన ఇవ్వాల్సిన ఫిట్‌మెంట్‌ను 22 శాతానికి తగ్గించారు. ఎప్పుడూ లేనిది పిఆర్‌సిలో జీతాలు పెరగకపోగా తగ్గాయి. నాలుగు శాతం వరకూ తగ్గించడంతో రెండు జిల్లాల్లోని గురువులు ఆర్థికంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలోని ఓ ఉపాధ్యాయునికి రూ.97 వేల జీతం వస్తుంటే అది పిఆర్‌సి తర్వాత రూ.83 వేలకు తగ్గిపోయింది. గతంలో ఎన్నడూ ఇలా జరిగింది లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా అవమానాలు
ఏడాదిగా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయింది. ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించడం. నోట్స్‌, పాఠ్యపుస్తకాలు చూసి విద్యార్థులను ప్రశ్నలు అడగడం, ఎవరైనా సరిగా చెప్పలేకపోతే పిల్లల ముందే ఉపాధ్యాయులను అవమానించడం, వాటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని వాపోతున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత తమపై ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదని, దానికోసం తాము ఎంత సమయమైనా కేటాయిస్తామని, అయితే ఇలా అవమానించడమే ఎక్కువ బాధగా ఉంటోందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు.
ప్రభుత్వ విధానాలతో సతమతం
జిఒ నెం.117తో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని సవరించారు. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను దగ్గర్లో ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. దీంతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న వారిపైనే ఒత్తిడి పెంచేసి పాఠాలు చెప్పించడం వల్ల రోజంతా ఎనిమిది పీరియడ్లు ఉంటే కనీసం ఏడు చెప్పాల్సి వస్తోంది. వారానికి గత ప్రభుత్వంలో 30 పీరియడ్ల వరకూ ఉండగా ప్రస్తుతం కనీసం 40 నుంచి 45కు పెరిగాయి. దీనివల్ల విద్యార్థుల నోట్స్‌ దిద్దడానికి, పాఠాలు చెప్పేందుకు సన్నద్ధమవ్వడానికి సమయం లేక అవస్థలు పడుతున్నామని గురువులు వాపోతున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌, యాజ్‌ ఎ ఫారెన్‌ లాంగ్వేజ్‌) పేరుతో మూడో తరగతి నుంచి తొమ్మిది వరకూ ఆంగ్ల ఉపాధ్యాయులు వారానికి మూడు పీరియడ్లను అదనంగా చెప్పాల్సిన పరిస్థితి. దీంతో వారానికి 45 పీరియడ్లుపైనే బోధించాల్సి వస్తోంది. ఇంత భారమైనా అలాగే బోధిస్తున్నా ప్రభుత్వం మాత్రం కనీసం టోఫెల్‌కు సంబంధించి ప్రింటెడ్‌ మెటీరియల్‌, ఓ పుస్తకం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. అంతా సామాజిక మాధ్యమం చూసే బోధించాలని చెబుతోందంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.