పుడమి నుండి
పురుడు పోసుకున్న
విత్తనాన్ని అడుగు
తను పడ్డ
పురిటినొప్పుల గురించి
చెపుతుంది.
నీ కడుపునింపే ఆ విత్తనానికీ
లేని భేషజం నీకెందుకు ?
నీ పాపాల శాపాలకు
కాలుష్య రక్కసికి చిక్కి
విల విల్లాడుతున్న
స్వచ్ఛమైన గాలిని అడుగు
కలుషిత విష వలయం నుండి
బయటపడ్డ వైనాన్ని చెపుతుంది
నీ ప్రాణాన్ని నిలిపే ఆ గాలికి
లేని అహం నీకెందుకు ?
భూపొరలలో నిక్షిప్తమై
నీ మితిమీరిన అవసరాలకు
బలి అవుతున్న
నీటి వనరులను అడుగు
నీవు గొట్టాలతో తోడే
గడ్డు పరిస్థితుల నుండి
తట్టుకుని నిలబడే
సందర్భాలను చెపుతుంది
నీ దాహాన్ని తీర్చే ఆ నీటికి
లేని ఆధిపత్యం
నీ దేహానికెందుకు ?
ఇకనైనా పర్యావరణాన్ని
నీవు ప్రేమించకపోతే
నీ ఆత్మే నిన్ను 'ఛీ' కొట్టి
నీ శరీరం నుండి వెళ్ళిపోతుంది
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239