May 07,2021 10:13

''సింహం మామా.. ఏమిటి కోపంగా వస్తున్నావు'' అనడిగింది చెట్టు మీదున్న కాకి.
''ఆకలిగా ఉంది. అడవంతా తిరిగినా ఒక్క ఒక్క జంతువూ దొరకలేదు. ఇదేమి అడవో... కొన్ని రోజుల్లో పక్క అడవికి వెళ్లిపోదామనుకొంటున్నాను.. '' అని నీరసంగా అంది సింహం.
''పొరుగున ఉన్న అడవి మహా పొడవు అంటే ఇదే మరి! నిజానికి అక్కడ కూడా ఇలాంటి సమస్యలున్నాయి. వెళ్లి చూడు నీకే తెలుస్తుంది.'' అంది కాకి
''ఆ అడవిలోనూ ఇలాంటి సమస్యలా? మానవులకు దొరికిపోయినా బాగుండేది. ఏ జంతు ప్రదర్శనశాలలోనో పెట్టి సమయానికి ఇంత తింగి పెడతారు. నాకా అదృష్టం లేదు.'' అంది సింహం.
'' ఆ జంతు ప్రదర్శనశాలలో ఉన్న మీ సింహాల పరిస్థితి కూడా బాగోలేదు. నేను ఇంతకు ముందు అక్కడినుంచి వచ్చాను.'' అంది కాకి.
''అక్కడేమైంది?'' ఆత్రుతగా అడిగింది సింహం.
''మానవులు ప్రకృతికి వ్యతిరేకంగా జీవించడం నేర్చుకొని ఎన్నో వింత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పుడు కోవిడ్‌ అని ఓ కొత్త వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది. జనం మధ్య జీవిస్తున్న మన సింహానికి కూడా ఆ వ్యాధి సోకింది.. పాపం..'' అంది కాకి.
''అయ్యో .. అలాగా... ఈ అడవిలో చెట్ల మధ్య ప్రకతికి హాని కలిగించకుండా మనం జీవిస్తున్నందువల్ల మనకు ఎటువంటి రోగం కలగలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదైనా దొరికితే తింటాను. ఇక నేనెక్కడికి పోను. ఈ అడవిలోనే వుంటాను.'' అంది సింహం.

- ఓట్ర ప్రకాశరావు