May 25,2023 23:36

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎస్‌ చెంగయ్య

ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి పట్టణం 4వ వార్డులోని ఎస్టీ కాలనీలో కొండ ప్రాంతంలో నివసిస్తున్న పేదలను ఇక్కడ నుంచి తొలగించి, రాజధాని ప్రాంతంలో స్థలాలిస్తామనే ప్రభుత్వ మాటలను నమ్మలేమని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గురువారం రాత్రి ఆ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఇళ్లేసుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు ఉన్నఫళంగా మరోప్రాంతానికి వెళ్లాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. తమ వద్ద అంత ఆర్థిక స్తోమత లేదని చెప్పారు. విజయవాడ పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో అనేక మంది నివాసం ఉంటున్నారని, అక్కడ లేని ఇబ్బంది ఇక్కడెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడున్న తమ ఇళ్లకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సిఎం సభకు తాము వెళ్లబోమని స్పష్టం చేశారు. తమ సమస్యపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేస్తామని ప్రకటించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలను ఇక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం పూనుకుందని, వీరికి తాము అండగా ఉంటామని చెప్పారు. వీరి ఇళ్లకు ప్రభుత్వం పట్టాలిచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.