ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పంటల కొనుగోలు, బీమా వర్తింపు సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు రైతుల ఇకెవైసి అత్యంత కీలకంగా మారింది. ఈనేపథ్యంలో రైతులు ఆర్‌బికెలకు వచ్చి ఇకెవైసి నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు, ఆర్‌బికె సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో బిజిబిజీగా వున్నారు. మరోవైపు గడువు సమయం ముంచుకొస్తోంది. ఈనెల 9వ తేదీతో ఇకెవైసి ఇక్రాప్ నమోదు పూర్తిచేసి, 15నాటికల్లా నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఇటు రైతులు, అటు అధికార యంత్రాంగం ఎంతో సమన్వయం, ముందుచూపుతో వ్యవహరించాల్సి వుంది.
ఇ-క్రాప్ నమోదుకు ఈనెలాఖరు వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వాప్తంగా అన్ని జిల్లాల్లోనూ లక్ష్యానికి చేరుకోకపోవడంతో ఈనెల 9వరకు సమయం పొడిగించారు. దీంతో, ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలుపుకుని జిల్లాలో 95శాతం ఇ-క్రాప్ పూర్తిచేశారు. మిగిలిన నాలుగు రోజుల్లో 5శాతం పంటలను నమోదు చేస్తామని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు బుక్‌చేసిన ఇ-క్రాప్‌లో కేవలం 50 శాతం మాత్రమే ఇకెవైసి నమోదైంది. దీంతో, ఇంతకు మించి ఇ-క్రాప్ నమోదు జరిగినట్టుగా పరిగణించే పరిస్థితి లేదు. నాలుగు రోజుల్లో రైతుల నుంచి ఇకెవైసి తీసుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సివుంది. దీనికితోడు జిల్లాలో ఆన్‌లైన్‌లో ఇకెవైసి చేసుకునేందుకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ప్రభుత్వం ఆన్‌లైన్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 4,15,297 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుకావాల్సివుండగా ఇప్పటి వరకు 3.62లక్షల ఎకరాల్లో సాగైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రూ.3.43 లక్షల ఎకరాలు అంటే 95శాతం మేర ఇ-క్రాప్ బుక్‌చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వరి ఈ ఏడాది 2.23లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సివుండగా ఈ ఏడాది 2.21లక్షల ఎకరాల్లో సాగైంది. 1,73,804 మంది రైతులకు చెందిన 2.18లక్షల ఎకరాల మేర ఇ-క్రాప్ నమోదైంది. ఈలెక్కన 99శాతం వరి ఇ-క్రాప్ నమోదైనట్టుగా చెబుతున్నారు. మొక్కజొన్న 37,728 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా 76శాతం నమోదైంది. పత్తి 94శాతం నమోదు చేశారు. నువ్వుల పంట 9,817 ఎకరాల్లో సాగవ్వగా 70 శాతం నవ్వులపంట గుర్తింపునకు నోచుకోలేదు. మొత్తం పంటల్లో నమోదైన ఇ-క్రాప్‌లో 50 శాతం మాత్రమే ఇకెవైసి అవ్వడంతో ఆమేరకు మాత్రమే ఇ-క్రాప్ బుకింగ్ జరిగినట్టుగా భావించవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతులు ఇకెవైసికి ముందుకు రావడం లేదని, సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
పంటలకు ఇ-క్రాప్ నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంట నష్టపరిహారం, బీమా, సున్నావడ్డీ పథకాలు వర్తింపజేస్తున్న విషయం విదితమే. వీటితోపాటు ఉత్పత్తులను కొనుగోలు చేసి, వాటికి కనీస మద్దతుధర కల్పించేందుకు కూడా ఇకెవైసితో కూడిన ఇ-క్రాప్‌తోనే ప్రభుత్వం ముడిపెట్టింది. ఇ-క్రాప్ కింద గుర్తింపు పొందని రైతులు, ముఖ్యంగా ధాన్యం విక్రయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు
ఇకెవైసి తప్పనిసరి
ఈ పంట నమోదు లోని నమోదైన ప్రతి రైతు తప్పనిసరిగా ఇకెవైసి చేసుకోవాలి. ఇప్పటివరకు జిల్లాలోని రైతులు 50 శాతం వరకే ఇకెవైసి చేసుకున్నారు. ప్రతి రైతు తమ దగ్గరలోని ఆర్‌బికెలో వ్యవసాయ సహాయ కులు కలిసి తప్పనిసరిగా ఇకెవైసి చేయించు కోవాలి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇకెవైసి చేసుకునేందుకు మన జిల్లాలో అనుమతి ఇచ్చారు. ఇకెవైసి చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులు. ఈ అవకాశం ఈనెల తొమ్మిదో తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
విటి రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి










