Jul 11,2023 00:19

జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో మాట్లాడుతున్న కెఎం.శ్రీనివాస్‌

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి, కలెక్టరేట్‌, విశాఖ
అంగన్‌వాడీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే కుట్రలను తిప్పికొడుతూ, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని వక్తలు అన్నారు. రాజకీయ జోక్యం అరికట్టి, ఒత్తిళ్లులేకుండా చూడాలని పునరుద్ఘాటించారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు 36 గంటల ధర్నా సోమవారం ప్రారంభమైంది. యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగశేషు మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కంటే అంగన్‌వాడీలకు ఎక్కువ వేతనాలు పెంచుతామని జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలన్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యంచేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ పోరాటాల ద్వారా అడ్డుకున్నట్లే, పోరాటాలతోనే కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, టిఎ, డిఎ, గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ సదుపాయాలు సాధించుకోవాలన్నారు. 300 దాటిన మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చి, వేతనాలు పెంచాలని కోరారు. ఒకవైపు ప్రీ స్కూల్‌ నడిపే అవకాశంలేకుండా రకరకాల పనులు అప్పగిస్తూ, మరోవైపు పిల్లలు తక్కువున్నారని కేంద్రాలను విలీనం చేస్తున్నారని తెలిపారు. అవినీతి, భూకబ్జాలను వదిలేసి పేదలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు పెంచి, బాధించడం విచారకమన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ అంగన్‌వాడీల సేవలకు గుర్తింపుగా కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలన్నారు. ఐసిడిఎస్‌పై శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.వరలక్ష్మి మాట్లాడుతూ, స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే జగన్‌ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు ఐదువేల వేతనం చాలన్న కలెక్టర్‌ తన మాటను వెనక్కుతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మాతా,శిశుమరణాలు తగ్గడానికి అంగన్‌వాడీలు అందిస్తున్న సేవలు కారణమన్న వాస్తవాన్ని గుర్తెరిగా వేతనాలు, సదుపాయాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు డిడి వరలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, కోశాధికారి వివి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు దేముడునాయుడు, సోమినాయుడు, ఎపి కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి జి.నాయినిబాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఎం.దుర్గారాణి, కోశాధికారి వివి రమణమ్మ, ప్రాజెక్టు నాయకులు కె.రామలక్ష్మి, బి.సుబ్బలక్ష్మి, ఎస్‌.సత్యవేణి, వి.సామ్రాజ్యం, మంగ, కె.ఉమారమణమ్మ, కె.కాసులమ్మ, రమణి, జానకి, మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ధర్నా శిబిరాన్ని పీడీ సందర్శన
కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన మహాధర్నా శిబిరం వద్దకు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉషారాణి వచ్చారు. అంగన్‌వాడీల సమస్యలను అడిగితెలుసుకున్నారు. నాడు-నేడు బాధ్యతల నుంచి అంగన్‌వాడీలను తప్పించాలని, నాణ్యమైన యూనిఫాం ఇవ్వాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, ఖాళీలు భర్తీ చేయాలని, టిఎ, డిఎ బకాయిలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని తదితర సమస్యలను పీడీ దృష్టికి నాగశేషు తీసుకెళ్లారు. దీనిపై పీడీ స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
మండుటెండలో అంగన్‌వాడీల ధర్నా
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటకీ 36 గంటల మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి అంగన్‌వాడీలు వచ్చారు. మధ్యాహ్న భోజనాలు వెంటతీసుకొని వచ్చారు. రాత్రిపూట వంటావార్పు నిర్వహించారు.
అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలి
కలెక్టరేట్‌ :
పాదయాత్ర సందర్భంగా అంగన్‌వాడీలకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఎపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం 36 గంటల దీక్షను జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చనందుకు నిరసనగా నల్ల చీరలు ధరించి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షను సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లను,హెల్పర్లను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కన్నా రూ.1000 అదనంగా వేతనం ఇస్తానన్న హామీ నేటికి నేరవేరకపోవడం అంగన్‌వాడీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిర్ల్యక్షమో అర్ధమౌతుందన్నారు. వేతనాలు పెంచక, గ్యాస్‌ ఇవ్వక, టిఎ, డిఎ బిల్లులు కూడా ఇవ్వకుండ పని భారం మాత్రం విపరీతంగా పెంచడం బానిసత్వమన్నారు.
రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం ఫెన్షన్‌, 300 జనాభా దాటిన మిని సెంటర్ల్‌లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల వయోపరిమితిని తొలగించాలని, 2022లో పరీక్ష రాసి పెండింగ్‌లో వున్న 164 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, హెల్పర్స్‌ ప్రమోషన్లలో వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, రాజకీయ జోక్యం అరికట్టాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అనవసరమైన యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా నాయకులు కె.బృంద, పి.మణి, వై.తులసి, ఎల్‌.దేవి, ఆర్‌.శోభారాణి, కె.పద్మావతి, ఆర్‌.నాగేశ్వరి, ఎం.వెంకటలక్ష్మి, బి.భవాని, వై.శ్రీదేవి, నూకరత్నం, బి.ఈశ్వరమ్మ, పాపవేణి, ఎ.సత్య, ఎల్‌.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.