అతను
పుట్టింది మొదలు
మట్టితోనే సావాసం
మట్టి పెళ్లలే ప్రేరణగా
గెట్టు మీది చెట్టు లాలనగా
మట్టిని పిసికి
మట్టిలోకి దిగి ఒరాలు గట్టి
మళ్లు జేసి
మట్టిపై మమకారంతో
తన జీవిత కాలమంతా
మట్టి పరిశోధనలకే వెచ్చించు
కాలాలు కార్తెలు ఋతువులు
ఎర్ర నల్ల చౌడు ఇసుక నేలల
తీరుతెన్నుల మేధావి
కురిసే చుక్కల కొలిచే
వర్షమాని అతను
పదును చూసి
విత్తే గింజ జ్ఞానం ఆతని అనుభవం
సేద్య అజ్ఞాని
చేతిలో పత్రాలట్టుకుని
అతనితో ఒప్పందమంటూ
బండలు పగిలే ఎండలో
బయల్దేరితే
అతనే పంటేయాలో
సేద్య నిరక్షర కుక్షి సెలవిస్తుంటే
సంతకాలెట్టాలనే సరికొత్త చట్టం
చేలో పంట చేలోనే అమ్ముకునే అతను
గిట్టుబాటు కోసం గిడ్డంగులకు ఔరా! లెస్స పలికితివే!! పో!!
నిల్వ సామర్థ్యమే వుంటే నల్ల బజార్లు ఏనాడో బేజారు
సరిహద్దులు దాటి అమ్ముకోమనే
తేనెలొలికే విషపు పలుకుల ఆంతర్యం
ఎరిగి ఏడాదిగా రహదార్లపై
భాష్ప వాయుగోళాలు
జల ఫిరంగులు కురిసినా
బుల్లెట్లు దూసుకొచ్చినా
ఇనుప కంచెలు పరచినా
వెరవక సాగుతున్న ఆందోళనతో
వెన్నులో వణుకు
అణచేయాలనే కుతంత్రాలు
విడదీసే కుట్రలు
డయ్యర్‌ని మించిన ఘనులు
కాల్పులే కాదు
కాన్వారుతో తొక్కించిన తొత్తులు
నల్ల కోట్లు
కళ్లకి నల్ల గుడ్డ కట్టుకున్న తెల్లబొమ్మ
మౌఢ్యం నిండిన పాషాణాల హుకుంకి జీ హుజూర్
తేట తెల్లంగా మోసబోయేది అతనే
అతన్నే చంపేస్తే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లవని
తెలియని సన్నాసులు
అతనికి కులం లేదు మతం లేదు
అయినా అతని కంటే వ్యాపారికే వత్తాసు
నేల అతనిది
పంట అతని కష్టం
మధ్యలో బేవార్స్ పెత్తనం
పెళ పెళ మంటూ విరుచుకు పడుతూ
అడుగులు పడకపోతే
పిడికిళ్లు బిగించకపోతే
అతనికే కాదు
అందరికీ ఈ నేలపై నూకలు చెల్లినట్లే
తాను మాడి
పరుల కడుపు నింపే నిస్వార్థజీవి
అతనిదే ఈ దేశం
కాదన్నోడి కాలం మూడినట్లే
గిరిప్రసాద్ చెలమల్లు
94933 88201