Nov 10,2023 23:34

ఇజ్రాయిల్‌ యుద్దోన్మాదం పాలస్తీనాకు మద్దతుగా... సంఘీభావ నిరసనలు

ఇజ్రాయిల్‌ యుద్దోన్మాదం
పాలస్తీనాకు మద్దతుగా...
సంఘీభావ నిరసనలు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలని, సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాదం నశించాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని వామపక్ష పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్‌.టి.సి బస్టాండు దగ్గర వున్న గాంధీ బొమ్మ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు నాగ సుబ్బారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటరత్నం, ఎస్‌ యు ఎస్‌ ఐ (కమ్యూనిస్టు) జిల్లా నాయకులు ప్రతాప్‌ సింగ్‌, ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా చేస్తున్న యుద్ధం నెల రోజులు దాటిందని, వేలాదిమంది ఈ మారణ కాండలో బలయ్యారని అన్నారు. శరణార్థుల శిబిరాలపై బాంబుదాడులు జరుగుతున్నాయని పసిపిల్లలు, మహిళలు, పౌరుల శవాల గుట్టలు హదయవిదారకంగా ఉన్నాయని ప్రపంచంలో అనేక దేశాలలో ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా ప్రోత్సాహంతో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదన్నారు. సామ్రాజ్యవాద అమెరికా తన ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్‌ను తన బ్రాంచ్‌ ఆఫీసుగా చేసుకుని యుద్ధాన్ని ప్రేరేపిస్తుందని, పాలస్తీనా ప్రజల కాంక్ష మేరకు వారికి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి..,అక్కడి ప్రజలను అణచి వేస్తున్నారని అన్నారు.అణచివేతకు వ్యతిరేకంగా, తమ ఉనికి కోసం మిలిటెంట్లగా మారి సాయుధ బలగం ద్వారా ఇజ్రాయెల్‌ పై దాడులకు తెగబడిన హమాస్‌ ఉగ్రవాద సంస్థ సభ్యులను శిక్షించడం పోయి సామాన్య ప్రజలపైన, డాక్టర్లు, పసిపిల్లల మీద బాంబు దాడులు చేయడం అన్యాయమని అన్నారు. గతంలో ఇదే హమాస్‌ సంస్థకు అమెరికా ఆయుధాలతో ప్రోత్సహించిన విషయం మరవకూడదని అన్నారు. ఇజ్రాయెల్‌ దాడుల ఫలితంగా పాలస్తీనాలో పది వేలకు పైగా ప్రజలు మరణించడం.. ఇందులో 2 వేలకు పైగా చిన్నపిల్లల మరణించడం హేయమని అన్నారు. ప్రపంచపు యుద్ధ నీతిని పాటించకుండ వైద్యులు, పేషంట్లు వున్న హాస్పిటల్లపై దాడి చేయడం, శరణార్థి శిబిరాలపై బాంబులు వేయడం చూస్తే ఇది రెండు వైపుల నుండీ జరిగే యుద్ధం కాదని.. అమెరికా అండతో ఇజ్రాయెల్‌ చేస్తున్న దమనకాండని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శిలు జల్లా విశ్వనాథ్‌ ,టీ సుబ్రహ్మణ్యం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కేతారి రాధాకష్ణ, సిపిఎం నాయకులు వేణు, బుజ్జి , సిపిఐ ఎంఎల్‌ నాయకులు గంగా, మునీంద్ర ఎస్‌ యు ఎస్‌ ఐ పార్టీ నాయకులు హరీష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో... సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా అంబేద్కర్‌ కూడలి వద్ద నిరసన తెలిపారు. అమెరికాసామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పాలస్తీనా భూభాగం పాలస్తీనాదేనని మహాత్మాగాంధీ ఎపుడో చెప్పారని గుర్తు చేశారు. అయితే పాలస్తీనా ప్రజలను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం మద్దతు పలకడం దారుణమని అన్నారు. సిపిఐ నాయకులు జనమాల గురవయ్య, పీ డిఎస్యు నాయకులు జాకీర్‌, సిపిఎం నాయకులు గంధం మణి, వెలివేంద్రం, రాజా అన్వర్‌ బాషా, ఉస్మాన్‌, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
పుత్తూరు టౌన్‌లో... అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సెల్వరాజా ఆచారి, రవి, పురుషోత్తం, సుబ్రమణ్యం, రమేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.