
పాలస్తీనాపై దాడికి వామపక్షాల ఆధ్వర్యాన నిరసనలు
ప్రజాశక్తి - భీమవరం
ఇజ్రాయిల్ పాలస్తీ నాపై అత్యంత దుర్మార్గంగా వ్యహరి స్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. స్థానిక ప్రకాశంచౌక్ సెంటర్‌లో సిపిఎం, సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీ భావంగా శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఇజ్రాయిల్ పాలస్తీనాపై నరమేధానికి పాల్పడిందన్నారు. 10 వేలకు పైగా చిన్నపిల్లలు, మహిళలను పొట్టన పెట్టుకుందన్నారు. క్షతగాత్రులకు చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రులపై బాంబులతో దాడిచేసి మారణకాండకు పాల్పడిందన్నారు. అందరం ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని ఖండిరచాలన్నారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలన్నారు. దేశ ప్రధాని మోడీ అమెరికాకు వత్తాసు పలకడమంటే అత్యంత హ్యేయమైన చర్య అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఈ దాడుల్లో 10,418 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఫార్వర్డు బ్లాకు జిల్లా నాయకులు లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ పాలస్తీనీయులకు సంఘీభావంగా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నా దాడులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల నుంచి సహకారం అందనివ్వకుండా అన్ని దారులూ మూసేసి పాలస్తీనీయులను హింసకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్, బి.వాసుదేవరావు సిపిఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, సిపిఎం నాయకులు ఎం.వైకుంఠరావు, ఎం.ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తణుకు రూరల్ : పాలస్తీనా భూబాగాన్ని ఆక్రమించిన, ఇజ్రాయిల్‌కు భారత్ మద్దతివ్వడం సిగ్గుచేటని సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శులు పివి.ప్రతాప్, బొద్దాని నాగరాజు విమర్శించారు. శుక్రవారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు, ప్రతాప్ మాట్లాడుతూ ఈ రోజు ఇజ్రాయిల్‌గా చెప్పబడుతున్న దేశం ఒకప్పుడు లేనేలేదన్నారు. పాలస్తీనా జాతిని నిర్మూలించే దిశగా అమెరికా ఆదేశాలకనుగుణంగా ఇజ్రాయిల్ నడుస్తోందన్నారు. ఆయిల్, చమురు ఉన్న అరబ్ దేశాలపై పెత్తనం చేయడానికే పాలస్తీనాను నాశనం చేస్తున్నారన్నారు. 34 రోజులుగా యుద్ధం వల్వ ఆస్తి, ప్రాణ నష్టం వచ్చిందన్నారు. యుద్ధాన్ని ఆపి పాలస్తీనాకు రక్షణ కల్పించాల్సిన ఐక్యరాజ్య సమితి ప్రేక్షకుడిలా మారిపోవడం బాధాకరమన్నారు. దేశ ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.అజయకుమారి, గార రంగారావు, కామన మునిస్వామి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : వామపక్షాల పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్, సిపిఎం ఆధ్వర్యంలో అమెరికా రక్షణ మంత్రి గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. అమెరికా దేశానికి భారతదేశాన్ని జూనియర్ భాగస్వామిగా తయారు చేసిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడికి ఐక్యరాజ్యసమితి ఖండించిందని ప్రధాని ఇజ్రాయిల్‌కు మద్దతు తెలిపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, ఎ.ఆంజనేయులు, ఎస్‌విఎస్ రెడ్డి కర్రి సుబ్బిరెడ్డి, గాది వెంకట్రావు, ఎన్.కృష్ణ సత్తి దుర్గారెడ్డి పాల్గొన్నారు.