May 22,2021 07:32

   స్వయం నిర్ణయాధికారం కోసం పాలస్తీనియన్లు జరిపే పోరాటం ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘమైన జాతీయ విముక్తి పోరాటం. ఏడు దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. 1967 ముందు నాటి ఇజ్రాయిల్‌ సరిహద్దుల పొడవునా పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పడే వరకు ఈ పోరాటానికి అంతం లేదు.
   జెరూసలెంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దాడులు, గాజాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణలను వేర్వేరు యాదృచ్ఛిక ఘటనలుగా చూడరాదు. ఇవి, గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ లోని ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న సుదీర్ఘ యుద్ధంలో భాగమే. 1967కి ముందు ఇజ్రాయిల్‌ సరిహద్దు ల్లోని అరబ్‌-పాలస్తీనియన్లపై అణచివేతలో భాగమే. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ - ఆ ఆక్రమణ చరిత్రలో, సెటిలర్ల వలసవాదంలో, జాతుల ప్రక్షాళనలో, ఆక్రమిత భూభాగాల్లో వర్ణ వివక్ష ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో ఒక అధ్యాయమే. తూర్పు జెరూసలెం లోని షేక్‌ జారా ప్రాంతంలో జరుగుతున్నది...1948 నుండి అక్కడ నివాసముంటున్న పాలస్తీనా కుటుంబాలను వెళ్ళగొట్టే ప్రయత్నమే. పాలస్తీనియన్ల ఇళ్లను, వారి భూములను లాక్కోవడం ద్వారా ఆనాడు ఇజ్రాయిల్‌ స్థాపించబడింది.
   మితవాద యూదు పార్టీలు అధికారం లోకి రావడం, బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలో వరుసగా మితవాద ప్రభుత్వాలు రావడంతో పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని వర్ణ వివక్ష, జాతి వివక్ష విధానాలు అనుసరించడం ఉధృతమయ్యాయి. ఇజ్రాయిల్‌లో నాల్గోసారి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడకపోయినా ప్రస్తుత దాడులు, హింసాకాండ కొనసాగుతూనే వున్నాయి. షేక్‌ జారాలో మితవాద సెటిలర్ల గ్రూపులు వారి సాయుధ రక్షకులతో, పోలీసుల సాయంతో అక్కడ గల పాలస్తీనా కుటుంబాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని పాలస్తీనియన్లు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. రంజాన్‌ ప్రారంభంలో, డమాస్కస్‌ గేటుకు సమీపంలో పాలస్తీనియన్లు కలుసుకునే ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ అధికారులు మూసివేశారు. ప్రపంచం లోని ముస్లింల పవిత్ర ఆరాధనా స్థలాల్లో మూడవ దిగా భావించే అల్‌ అక్సా మసీదుగల టెంపుల్‌ మౌంట్‌కు వెళ్ళే దారిలో ఈ ప్రాంతం వుంటుంది.
   మే 7వ తేదీన మసీదు ఆవరణలో నిరసన తెలియచేస్తున్న వారిపై సాయుధ పోలీసులు బాష్పవాయు గోళాలను, స్టన్‌ గ్రెనేడ్లను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించడంతో మొత్తంగా పాలస్తీనియన్లలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. ఈ దాడిలో వందలాదిమంది గాయపడ్డారు. ఇజ్రాయిల్‌ వ్యాప్తంగా పట్టణాల్లో పాలస్తీనియన్‌ అరబ్బులు నిరసన వ్యక్తం చేశారు. దాంతో మితవాద యూదు ముఠాలు, పోలీసులు తీవ్ర స్థాయిలో హింసకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతిగా గాజా లోని హమాస్‌ పాలకులు తూర్పు జెరూసలెంను, టెంపుల్‌ మౌంట్‌ ప్రాంతాన్ని వీడి వెళ్ళాల్సిందిగా ఇజ్రాయిల్‌ బలగాలకు అల్టిమేటమ్‌ జారీ చేశారు. ఈ డిమాండ్‌ను పెడచెవిన పెట్టడంతో వారు గాజా నుండి రాకెట్‌ దాడులకు పాల్పడ్డారు. గత 15 ఏళ్ళ నుండి ఈజిప్ట్‌ సాయంతో ఇజ్రాయిల్‌ గాజా ప్రాంతాన్ని దిగ్బంధించింది. అప్పటి నుండి 19 లక్షల మంది పాలస్తీనియన్లు నివాసముంటున్న ఈ ప్రాంతం నుండి ఇజ్రాయిల్‌ బలగాలను ఉపసంహరించుకుంది. అయినప్పటికీ 2008, 2014ల్లో గాజాపై మళ్లీ ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు తెగబడింది. 2014 యుద్ధంలో 2300 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలామంది సామాన్యులే. 18 వేలకు పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి.
    ప్రస్తుతం 9 రోజుల నుండి (మే 19 నాటికి) గాజాపై బాంబు దాడులు కొనసాగుతున్నాయి. 227 మంది మరణించారు. వీరిలో 64 మంది పిల్లలు, 38 మంది మహిళలు వున్నారు. క్షిపణులు, బాంబులతో ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడుల బీభత్సాన్ని చూసి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. దేన్నీ మినహాయించడం లేదు. నివాస భవనాలతో పాటు అంతర్జాతీయ మీడియా కార్యాలయాలు వున్న భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. గాజా లోని ఏకైక కోవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను కూడా ఈ దాడుల్లో ధ్వంసం చేశారు. రాకెట్‌ దాడులకు ఇజ్రాయిల్‌లో 12 మంది మరణించారు.
    కాల్పుల విరమణ పాటించాలంటూ చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయిల్‌ తిరస్కరించింది. తామనుకున్న లక్ష్యాలు, ప్రయోజనాలు నెరవేరే వరకు దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికా మద్దతు తోనే ఇజ్రాయిల్‌ ఈ నేరపూరితమైన విధానాలు, దురాక్రమణలను కొనసాగించగలుగుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో జెరూసలెం (ఆక్రమిత ప్రాంతంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన సమయంలో)ను ఇజ్రాయిల్‌ రాజధానిగా అమెరికా గుర్తించింది. పైగా ఆక్రమిత ప్రాంతాల్లో అక్రమంగా యూదులు ఏర్పాటు చేసుకున్న ఇళ్ళు చట్టబద్ధమేనని కూడా ట్రంప్‌ దుస్సాహసంతో ఒక ప్రకటన జారీ చేశారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వానికి ఇచ్చే మౌలిక మద్దతు నుండి అధ్యక్షుడు బైడెన్‌ కూడా పక్కకి మళ్లలేదు.
   తాజా హింస ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే, ఇజ్రాయిల్‌కు అత్యంత కచ్చితత్వంతో పని చేసే 73.5 కోట్ల డాలర్లు విలువ చేసే ఆయుధాల అమ్మకాన్ని బైడెన్‌ ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం గాజాలో దాడులకు ఆ తరహా ఆయుధాలే ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు భద్రతా మండలి సమావేశమైనా ఈ సంక్షోభంపై ఒక్క ప్రకటన జారీ చేయడానికి కూడా అమెరికా అనుమతించలేదు. కాల్పుల విరమణ పాటించాల్సిందిగా ఈ నెల 17న బైడెన్‌ పిలుపిచ్చారు. ఈ దాడులకు అంతం పలకడానికి ముందుగా గాజాలో తన దురాక్రమణ ప్రణాళికలు అమలు చేసుకోవడానికి ఇజ్రాయిల్‌కు గడువివ్వడమే అమెరికా ఎత్తుగడగా కనిపిస్తోంది.
   అమెరికాకు సన్నిహితంగా వుండే జోర్డాన్‌, యుఎఇ, సౌదీ అరేబియా వంటి అరబ్‌ దేశాలు ఎప్పటి నుండో పాలస్తీనా ప్రయోజనాలను త్యజించాయి. కేవలం మెచ్చుకోలు కబుర్లు చెప్పడం మినహా మరేమీ చేయడం లేదు. ఇటువంటి క్లిష్టతరమైన వాతావరణంలో, పాలస్తీనా ప్రజలు ఈసారి గొంతెత్తి నిరసన తెలియచేశారు.
   ఈసారి కొత్త అంశం ఏమంటే, ఇజ్రాయిల్‌లో నివసించే పాలస్తీనియన్లు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి షేక్‌ జారా వాసులకు తమ సంఘీభావాన్ని తెలియచేశారు. అల్‌ అక్సా మసీదుపై దాడిని తీవ్రంగా నిరసించారు. అఖా, లిద్దా, రమేలా, హైఫా వంటి నగరాలు, ఇతర ప్రాంతాల్లో పాలస్తీనా యువత వీధుల్లోకి వచ్చారు. యూదు దురహంకార మూకలు, పోలీసుల చేతుల్లో వారు హింసను ఎదుర్కొన్నారు. మతోన్మాద హింస ప్రబలింది. కొన్ని పట్టణాల్లో అయితే ఇజ్రాయిల్‌ ఆర్మీని కూడా రంగం లోకి దించాల్సి వచ్చింది. రెండవ తరగతి అరబ్‌ పౌరులపై యూదు జాత్యహంకార ప్రభుత్వం లోని అంతర్గత వైరుధ్యాలు బయటపడ్డాయి.
    ఇజ్రాయిల్‌లో నివసించే పాలస్తీనా పౌరులు గతంలో గాజాపై దాడి జరిగిన సందర్భాల్లో ఎలాంటి నిరసనల్లోనూ పాల్గొనలేదు. కానీ ఈసారి అన్ని ప్రాంతాల్లో పాలస్తీనియన్లు జరిపిన దేశవ్యాప్త నిరసనల్లో వారు కూడా భాగమయ్యారు. వెస్ట్‌ బ్యాంక్‌లో సార్వత్రిక సమ్మె జరిగింది. అక్కడ ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన దాడుల్లో 12 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
   మితవాద నెతన్యాహు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న మోడీ సర్కార్‌ ప్రస్తుత దాడులు, హింసాకాండ అధ్యాయంలో అమెరికా వైఖరినే అనుసరిస్తోంది. ఇజ్రాయిల్‌తో విస్తృతమైన భద్రతా, మిలటరీ సంబంధాలు వున్నందున మోడీ ప్రభుత్వం పాలస్తీనా అంశంపై గత వైఖరులకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మే 16న జరిగిన భద్రతా మండలి సమావేశంలో తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపిచ్చింది. కానీ కాల్పుల విరమణ జరపాలని కోరలేదు. ఇజ్రాయిల్‌పై గాజా రాకెట్‌ దాడులను ఖండిస్తూ ఇజ్రాయిల్‌ దూకుడు చర్యలను ప్రతీకార దాడులుగా అభివర్ణించింది. పాలస్తీనా ప్రయోజ నాలు, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి చాలా అస్పష్టమైన రీతిలో మద్దతిచ్చింది. కానీ, తూర్పు జెరూసలెంను పాలస్తీనా రాజధానిగా పేర్కొనలేదు. 2017 లోనే మోడీ ప్రభుత్వం దీన్ని వదిలివేసింది.
    బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరిగా కాకుండా, భారతదేశం లోని ప్రజాస్వామ్య రాజకీయ శక్తులు ఎల్లప్పుడూ పాలస్తీనా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతిస్తూనే వస్తున్నాయి. ఇది, మన స్వాతంత్య్ర పోరాట వారసత్వం. పాలస్తీనియన్లకు భారత ప్రజలు సంఘీభావాన్ని ప్రదర్శించే సమయం ఇది. కరోనా మహమ్మారి రెండో దశ పెచ్చరిల్లుతు న్నందున మన సంఘీభావాన్ని వీధుల్లోకి వచ్చి తెలియచేయలేక పోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంఘీభావ ప్రదర్శనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఇతర సాధ్యమైన అన్ని రీతుల్లో మన మద్దతు, సంఘీభావం వెలిబుచ్చాల్సిన అవసరం చాలా వుంది.
   స్వయం నిర్ణయాధికారం కోసం పాలస్తీనియన్లు జరిపే పోరాటం ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘమైన జాతీయ విముక్తి పోరాటం. ఏడు దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. 1967కి ముందు నాటి ఇజ్రాయిల్‌ సరిహద్దుల పొడవునా పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పడే వరకు ఈ పోరాటానికి అంతం లేదు.
 

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం /