ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఎంపి ఆకస్మిక తనిఖీ
తిరుపతి సిటీ : ఎంపి మద్దిల గురుమూర్తి శుక్రవారం తిరుపతి ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులను, సిబ్బందిని అడిగి సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా హాస్పిటల్ సిబ్బంది పలు సమస్యలను ఎంపి దష్టికి తీసుకొచ్చారు. రాయలసీమలో ఉన్న ఏకైక ఈఎస్‌ఐ హాస్పిటల్ కావడంతో అత్యాధునిక వైద్య చికిత్స పరికరాలను ఏర్పాటు చేయవలసిన అవశ్యకత గూర్చి వారు ఎంపీ గురుమూర్తి దష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈఎస్‌ఐ హాస్పిటల్ లోని అత్యాధునిక వైద్య పరికరాలు, మెషినరీ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ లో పలుమార్లు సమస్య గూర్చి చర్చ లేవనెత్తిన విషయం అందరికీ విదితమే. అలాగే చుట్టు పక్కల జిల్లాలకు ఏకైక ఈఎస్‌ఐ హాస్పిటల్ అయిన తిరుపతి ఈఎస్‌ఐ హాస్పిటల్ ని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా గుర్తించి, ప్రస్తుతం 50 పడకలతో సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా విస్తరించాలని కేంద్ర మంత్రి దష్టికి తీసుకెళ్లామని ఎంపి తెలియజేశారు. అలాగే మంచినీటి సమస్య గూర్చి ప్రస్తావించగా ఇప్పటికే అక్కడ ఉన్న ఆర్‌ఓ ప్లాంట్‌ను వినియోగం లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటామని తెలియజేశారు. అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని, గత దశాబ్ద కాలంగా జీత భత్యాలలో మార్పు లేకుండా ఉందని ఎంపి దష్టికి తీసుకు రాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి తెలియజేసారు.










