Feb 09,2023 23:55

నినాదాలు చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి - పరవాడ
పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన పరవాడలో ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన స్థానిక సినిమా హాల్‌ జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పరవాడ ఎన్‌టిపిసిలో కాంట్రాక్ట్‌ కార్మికులు 2000 మంది, ఫార్మాసిటీలో 30 వేల మంది, చిన్న తరహా పరిశ్రమల్లో మరో 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యాలు గురైనప్పుడు కార్మికులు విశాఖపట్నం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఫార్మాసిటీలో పేలుడు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులను విశాఖపట్నం తరలించే లోపు వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చెప్పారు. పరవాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మిస్తామని గతంలో ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాది మందితో డబ్బులు కట్టించుకుంటున్న ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నుండి ఆసుపత్రి ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కన్నూరు నాయుడు, దోకల జగన్‌, వి బాబు నాయుడు, పి శ్రీను, ఎం అప్పారావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.