Dec 15,2020 21:16

సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న మెడికల్‌ డైరెక్టర్‌ కుమార్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : నగరంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రిని ఎపి ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఎల్‌ఎస్‌బిఆర్‌ కుమార్‌ (ఐఆర్‌ఎస్‌) మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌, ఒపి, అడ్మినిస్ట్రేషన్‌, లేబొరేటరీ, ఫార్మా, కేజువాల్టీ తదితర విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌, ప్రిష్కప్షన్‌ విభాగాల్లో ఆన్‌లైన్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విభాగాల్లో అప్పటికప్పుడు కంప్యూటర్లు అమర్చేటట్టు చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావుకు సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. గదులు, పరిసరాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. లేబ్‌లోని పరికరాలు, మందుల కొరత, సాంకేతిక సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్రం దృష్టికి తేవాలని ఆదేశించారు. అనంతరం తనను కలిసిన ప్రజాశక్తితో మాట్లాడుతూ కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ వల్ల అన్నిరకాల ముందులు, వైద్యపరీక్షలకు అవసరమైన కిట్లు పూర్తిలో స్థాయిలో అందుబాటులో లేకపోవడం వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, త్వరలోనే అన్ని రకాల మందులు, పరీక్షలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. విజయనగరం లో తలపెట్టిన 100పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనేఇఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు చేపడతారని చెప్పారు. పర్యటనలో డైరెక్టర్‌ కుమార్‌ సహా ఇఎస్‌ఐ జెడి రవికుమార్‌, కార్పొరేషన్‌ ఎఇ హర్షవర్థన్‌, సైట్‌ ఇంజినీర్లు, ఇఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్లు గాంధీ, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.