Mar 24,2023 00:12

ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి తోట

ప్రజాశక్తి-చోడవరం
భారీ ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా పలు రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాలంగా వచ్చిన ఈ వర్షాలు అపరాల పంటలకు అపార నష్టాన్ని కలగజేశాయి. జనవరి నెలలో మెట్లు, పల్లపు భూముల్లో నువ్వులు అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంటలు కోత దశకు వచ్చింది. ఈ సమయంలో వర్షాలు కురవడంతో నువ్వుల పంటలు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే ఆరుతడి పంటల్లో నువ్వు పంట ప్రధానమైనది. వర్షాలకు ఈ పంటంతా దెబ్బ తినడంతో రైతులు చేతికొచ్చిన ఆదాయం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈదురుగాలులతో మామిడి పంటకు తీరని నష్టం జరిగింది. వర్షాలు, ఈదురుగాలుల వల్ల మొత్తం మామిడి పింజులు నేలరాలాయి. అరటి పంట జరిగిన నష్టం చెప్పనవసరం లేదు. పూర్తి స్థాయిలో నేలకొరిగింది. రైతు భరోసా కేంద్రాల ఉద్యోగులతో నష్టాన్ని అంచనాలు వేసి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నాను.
నేలకొరిగిన అరటి తోట
బుచ్చయ్యపేట : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం భారీగా ఈదురు గాలులు వేయడంతో పంటలు నేలపాలయ్యాయి. శానాపతి త్రినాథ్‌కు చెందిన రెండున్నర ఎకరాలలో గల అరటి తోట నేలకొరిగింది. చెట్లు మొత్తం విరిగిపోవడంతో లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
పంట నష్టాన్ని నమోదు చేయాలి
ప్రజాశక్తి అచ్యుతాపురం : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో వ్యవసాయశాఖ సిబ్బంది, అధికారులు పర్యటించి పంట నష్టాలను నమోదు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో గురువారం వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ప్రధానంగా నువ్వు పంట దెబ్బతిన్నదన్నారు. మొక్కజొన్న, మినుములు, పెసలు, అరటి తోటలు, ఇప్పుడే నాటిన చెరుకు నాట్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎకరాకు రూ.10వేలు నుండి రూ.25 వేల వరకు రైతులకు పెట్టుబడులు పెట్టి నష్ట పోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆదినారాయణ, రాము, పోలవరపు పారునాయుడు, కర్రి రాము, శరణం అప్పలనర్స, కర్రి కళావతి, రాజేశ్వరి పాల్గొన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సిపిఎం
దేవరాపల్లి : మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో గతమూడు రోజులు నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన వర్షం నీటితో మునిగిపోయిన పంటలను పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురుగాలుల ప్రభావంతో వందలాది ఎకరాల్లో అరటి తోటలు నేల మట్టమయ్యాయని తెలిపారు. నువ్వులు, వెరుశనగ, కాయగూరలు పంటలకు, జీడి, మామిడి పంటలకు తీవ్రనష్టం జరిగిందని పేర్కొన్నారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు.