May 28,2023 23:53

విరిగిన కరెంట్‌ స్తంభం

ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలో వాతావరణం మారి పెద్ద గాలులతో కూడిన వడగళ్ళ వర్షం పలు చోట్ల కురిసింది. గాలులు అధికంగా ఉండడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేెల కొరిగాయి. ఎన్‌ కంటారం పంచాయతీ శివారు సుద్దలపాలెం గ్రామంలో టేకు చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడి పోయాయి. గ్రామంలో ఉన్న విద్యుత్‌ స్తంభం ఒకటి విరిగి పడింది. సిహెచ్‌ ఎర్రవరం గ్రామంలో విద్యుత్‌ వైర్లు తెగి రెండు విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. అదే గ్రామంలో లంక ప్రసాద్‌ కు చెందిన ఇంటిపై పక్కనే ఉన్న చెట్టు విరిగి పడడంతో ఇల్లంతా పాక్షికంగా దెబ్బతింది. నర్సీపట్నం, కేడీపేట ప్రధాన రహదారిలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉండే వెదురు పుంతలో రోడ్డుపైకి అడ్డంగా వాలి పోయాయి దీంతో సుమారు అరగంట సేపు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు మామిడి కాయలు రాలి పోవడంతో మామిడి సాగు రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షానికి పలు గ్రామాల్లో డ్రైనేజీలు లేక పోవడంతో వర్షపు నీరంతా రోడ్లపైనే నిలిచి పోయింది.
పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గొలుగొండ ఎస్సీ కాలనీకి చెందిన సరమండ ముసిలిమ్మకు చెందిన గేదె మధ్యాహ్నం చెట్టు కింద కట్టి ఉంచారు. పాడి గేదేపై పిడుగు పడడంతో మృతి చెందింది. పాడి నమ్ముకుని ఆ పేద కుటుంబం జీవనం సాగిస్తున్నారు. పిడుగు పడడటంతో జీవన ఆధారం కోల్పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గేదె విలువ 80 వేల రూపాయల ఉంటుందని బాధితులు తెలిపారు. పశు వైద్య అధికారులు స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
చిన్నయ్యపాలెం గ్రామంలో మాతిరెడ్డి రమణమ్మ కు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. చనిపోయిన గేదె విలువ సుమారు 70వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి అరటి సాగు రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. మండలంలో ఏటి గైరంపేట, గాదంపాలెం, లింగంపేట గ్రామాలలో సుమారు 40 ఎకరాలలో అరటి తోటలు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి.