ప్రజాశక్తి-రాజవొమ్మంగి, అడ్డతీగల
రాజవొమ్మంగి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా ఈ మూడు మండలాల్లో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడ్డతీగల-వై.రామవరం వెళ్లే రహదారి మధ్యలో భారీ వృక్షం నేలకొరకడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు పోలీస్ సిబ్బంది చొరవతో గ్రామస్తులు రెండు గంటల పాటు శ్రమించి చెట్టు కొమ్మలను తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధంగా సాగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విపరీతమైన వడగాలప్పులతో కూడిన ఎండ కాయడంతో మన్యం వాసులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మధ్యాహ్నం తరువాత ఆకాశంలో ఒక్కసారిగా నల్ల మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న మన్యం వాసులు సేదతీరారు.
పిడుగుపాటుకు 3 ఆవుల మృతి
ఎటపాక : మండలంలోని పట్టుచీర గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపడి 3 ఆవులు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన తెల్లం రంగారావుకు చెందిన ఒక ఆవు, ఇర్పా ముత్తయ్యకు చెందిన 2 ఆవులు మృత్యువాత పడ్డాయి. వ్యవసాయానికి ఆసరాగా ఉండే ఆవులు మృతి చెందటంతో రైతులు బాధలో మునిగిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.










