May 18,2023 00:20

రాలిపోయిన మామిడి కాయలను చూపుతున్న రైతులు

ప్రజాశక్తి- కె.కోటపాడు : మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు విధ్వంసం సృష్టించాయి. గంట వ్యవధిలోనే మండలంలోని నాలుగు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం చేకూర్చాయి. మండలంలోని పాతవలస, మర్రివలస, శృంగవరం, గొట్లాం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వీచిన గాలుల వల్ల భారీ చెట్లు నేలమట్టమయ్యాయి. తోటల్లో నిండుగా ఉన్న మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. మామిడి తోటల కొమ్మలు విరిగిపోయి దారులు మూసుకుపోయాయి. గంటలో జరిగిన ఇంతటి విధ్వంసం ఎప్పుడు చూడలేదని రైతులు తెలిపారు. నేల రాలిన మామిడి కాయలను సిపిఐ మండల కార్యదర్శి గొర్లే దేవుడి బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం నాలుగు గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. రెడ్డి అప్పలనాయుడు, బొంతపల్లి రామారావు, పటాన సూర్యకు చెందిన మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు.