
ప్రజాశక్తి -గొలుగొండ: మండలంలో గురువారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. కొంగసింగి గ్రామంలో పిడుగు పడటంతో ఆ శబ్దానికి ఒక వ్యక్తి హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.
పలు గ్రామాల్లో చెట్లు విరిగి పోవడం, విద్యుత్ స్తంభాలు ఒరిగి పోవడం, విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. జానకిరామ్ పురం వద్ద విద్యుత్ వైర్ల పై చెట్టు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్త ఎల్లవరం గ్రామంలో పలు తాటి చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. ఈదురు గాలులకు జోగంపేట సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి.
కోటవురట్ల:మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మూడు గంటల వరకు బానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించగా అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం కురిసింది. సుమారు మూడు గంటల పాటు వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారి, ఎంపీడీవో కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద రోడ్లపై నీరు ప్రవహించింది. దీంతో, ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బుచ్చయ్యపేట:గురువారం ఉదయం నుండి భానుడు తన ప్రతాపాన్ని చూపించగా, మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులు, మెరుపులు ఉరుములతో భారీగా వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. ఈదురు గాలుల వల్ల మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని దిబ్బిడి, బుచ్చయ్యపేట, కందిపూడి, రాజాం తదితర గ్రామాల్లో మామిడి తోటల్లో మామిడికాయలు నేల రాలిపోయాయి.
దేవరాపల్లి : మండలంలో బుధ, గురువారాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్ర ఎండలు కాస్తున్నాయి. తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దట్టమైన మేఘాలు అలముకొని ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. గాలుల బీభత్సంతో పలు పంటలకు నష్టం వాటిల్లగా, విద్యుత్తు స్తంభాలు విరిగిపడి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేట ఎస్సీ కాలనీలో వరద నీరు నిల్వ ఉండడంతో కాలనీవాసులు పలు ఇబ్బందులకు గురయ్యారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కాలనీవాసులు కోరారు.
అచ్యుతాపురం : ఉరుములు మెరుపులతో గురువారం సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం ఉదయం నుంచి అత్యధిక వేడితో వాతావరణం వేడెక్కింది. సాయంత్రం నాలుగు గంటల వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు చల్లటి చినుకులు పడడంతో చల్లబడింది.