Nov 02,2022 23:57

ఆందోళన చేపడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - పెదబయలు:మండలంలోని గలగండ పంచాయతి ఈదులపుట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు సికరి సుకుమారి అధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీకి ప్రజా మద్దతు రోజు రోజుకు పెరుగుతుందని, వైసిపి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత గ్రామాలలో మొలైందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం పివిటిజిలకు చేసిందేమీ లేదని, గత ప్రభుత్వ హయాంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీడీఏలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి పివిటిజిలకు రుణాలు అందించామన్నారు.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. గ్రామాలలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శీకరి సుకుమారి, మాజీ సర్పంచ్‌ త్రినాథ్‌,అరకు పార్లమెంట్‌ రైతు సంఘం అధ్యక్షుడు కూడ భూషణరావు, అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి శీకరి వెంకటేష్‌, దారెల సర్పంచ్‌ పాండురంగస్వామి, టీడిపి సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.