Mar 05,2021 07:46

''ఎవడబ్బ సొమ్మని కులుకూతూ తిరిగేవూ రామచంద్రా'' అంటూ భక్త రామదాసు ఆనాడు ఏకంగా ఆ రాముణ్ణే నిలదీసి అడిగేడు. ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో రాముడికి, సీతకి, లక్ష్మణుడికి నగలు చేయించాడు రామదాసు. ఆ విషయాన్నే వచ్చి తానీషా కొలువులో చెప్పమని రామదాసు డిమాండ్‌ చేసేడు. ఆ దెబ్బకి రాముడంతటివాడు వచ్చి తానీషాకి మొత్తం సొమ్ము చెల్లించి రసీదు తీసుకుని మరీ పోయేడు. ఇది కథే. కాని ఈ కథలో నీతి ఏమిటి?
ప్రజల సొమ్ముతో ఇష్టం వచ్చినట్టు నాటకాలాడడానికి వీల్లేదని, ఆ ప్రజలే డిమాండ్‌ చేస్తే ఆఖరుకు ఆ దేముడైనా దిగి రావలసిందేనన్నది రామదాసు చరిత్రలోని నీతి. మరి నిత్యం ఆ రాముడి పేరే గత ముప్పై ఏళ్ళుగా చెప్పుకుని రాజకీయాలు నడిపి, ఇంకా నడిపిస్తున్న బిజెపి పాలకులు ఈ రోజు విశాఖ ఉక్కు విషయంలో చేస్తున్నదేమిటి?
విశాఖ ఉక్కు ఏదో వీళ్ళ స్వంత సొత్తు అయినట్టు ఆ ఉక్కును అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. ఇలా అమ్మే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు? పైగా ఇది విధాన నిర్ణయం అంటూ జివిఎల్‌ ప్రకటించడం, అదీ చాలదన్నట్టు ''ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? చర్చిద్దాం రండి'' అంటూ కుంటి సవాళ్ళు విసరడం చూస్తూ వుంటే తెలుగువారిలో ప్రతీ ఒక్కరికీ చిర్రెత్తుకొస్తోంది.
విశాఖ ఉక్కును అమ్మేసే హక్కు ఎవరిచ్చారు?
విశాఖ ఉక్కు కోసం కేంద్రం పెట్టిన పెట్టుబడి రూ.5000 కోట్లు మాత్రమే. దానికి ప్రతిగా పన్నులని, డివిడెండ్లని రకరకాలుగా విశాఖ ఉక్కు నుండి తిరిగి తీసుకున్నది రూ.46,000 కోట్లు పైమాటే. మార్వాడీ అప్పు కన్నా ఇది ఘోరం కదా. అదలా ఉంచితే, విశాఖ ఉక్కు కోసం భూములిచ్చిన ప్రజలకు ఎకరానికి ఇచ్చినది రూ.20,000 మాత్రమే. ఈ రోజు స్టీలు ప్లాంటు భూముల విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని మార్కెట్‌ అంచనా. మరి రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రభుత్వానికి రూ.46,000 కోట్లు దక్కితే, 22,000 ఎకరాల భూములిచ్చిన ప్రజానీకానికి ఎంత దక్కాలి? వారికి విశాఖ ఉక్కులో ఉన్న హక్కుతో పోల్చితే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కు ఎంత?
విశాఖ ఉక్కు కోసం మోడీ ప్రభుత్వం చేసినదేమిటి?
ఇంతకూ కేంద్రం పెట్టిన పెట్టుబడిలో బిజెపి అధికారం లోకి వచ్చాక విశాఖ ఉక్కులో ఏమైనా పెట్టుబడి పెట్టిందా? ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఏ హక్కుతో జివిఎల్‌ గారు (ఆయనగారు అధికార ప్రతినిధి) సవాలు చేస్తున్నారు?
విశాఖ ఉక్కుకు స్వంత గనులను కేటాయించమని డిమాండ్‌ చాలా కాలం నుంచీ ఉంది. మన మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక మైనింగ్‌ విధానాన్ని చాలా మార్చివేసింది. కార్పొరేట్లకు అమూల్యమైన గనులను కట్టబెట్టడానికి మాత్రమే తోడ్పడే విధానాన్ని తెచ్చింది. విశాఖ ఉక్కుకు స్వంత గనులను కేటాయించడానికి మాత్రం మనసు రాలేదు. కేటాయించమని అడగడానికి జివిఎల్‌ గారికి గాని, తక్కిన బిజెపి ఎంపీలకు గాని నోరు రాలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మెయ్యడానికి మాత్రం కేంద్రం సిద్ధం అయింది. ఆ నిర్ణయాన్ని వెనకేసుకు రావడానికి వీళ్ళు ఇక్కడ తయారు!
మోడీ గద్దెనెక్కాక విశాఖ ఉక్కుకు ఒరగబెట్టింది ఏమీ లేదు సరికదా, పోస్కోతో బేరాలు మోడీ ప్రభుత్వ హయాంలోనే వేగం అందుకున్నాయి. 2017లో ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయి. అంటే విశాఖ ఉక్కును ఏదోవిధంగా కబళించే ఆలోచనలే తప్ప పరిరక్షించి బలోపేతం చేసే దృష్టే లేదు. ఇదే బిజెపి విధానం అని ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది.
ప్రైవేట్‌ కార్పొరేట్లు చేతులెత్తేశాకనే వచ్చింది ప్రభుత్వ రంగం
ఇక ప్రభుత్వ రంగమా? ప్రైవేట్‌ రంగమా? అన్న విషయం మీద చర్చిద్దాం అంటూ సవాలు విసురుతున్నారు జివిఎల్‌ గారు! ఎప్పుడో పాచిపోయిన విషయం ఇది. అసలు భారత దేశంలో ప్రభుత్వ రంగం ఉనికిలోకి వచ్చినదే ప్రైవేటు రంగం తమకు చేతకాదని చేతులెత్తేసిన తర్వాతనే అని జివిఎల్‌ గారు మరిచిపోయినట్టున్నారు! టాటాలు, బిర్లాలు, విదేశీ కార్పొరేట్లు అందరూ ''మేం ఈ భారతదేశం ఆధునీకరణకు అవసరమైన పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టలేం, మా వల్ల కాదు'' అని జారుకున్నాకనే ప్రభుత్వ రంగం తెర మీదకొచ్చింది.
305 ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలు ప్రజల బీమా సొమ్మును ఇష్టం వచ్చినట్టు స్వాహా చేసి, క్లెయిములు ఎగ్గొట్టినప్పుడే వాటిని జాతీయం చేసి ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి ని స్థాపించారు. అదీ కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో. ఇప్పుడది మహా వృక్షమైంది. ప్రపంచంలోని ఏ ఇతర ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీకన్నా ఎక్కువ సామర్ధ్యంతో పాలసీదారుల క్లెయిములను చెల్లిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ ప్రైవేటు కంపెనీ బీమా సొమ్ము ఇవ్వదు. కాని ఎల్‌ఐసి ఇస్తుంది. కాని మోడీ ప్రభుత్వం మాత్రం ఎల్‌ఐసి ని తిరిగి ప్రైవేటు కార్పొరేట్లకే, ప్రజల సొమ్మును గతంలో స్వాహా చేసిన ఘనత వహించిన ప్రైవేటు రంగానికే కట్టబెట్టడానికి సిద్ధం అయింది. పైగా ఇది ఏదో గొప్ప విధాన నిర్ణయం అయినట్టు జివిఎల్‌ గారు సవాలు విసురుతున్నారు!
ఒక ఇన్సూరెన్సు మాత్రమేనా? ప్రైవేటు బ్యాంకులు దేశంలో పేదరిక నిర్మూలనకు ఏవిధంగానూ సహకరించడం లేదనే కదా 1969లో బ్యాంకులను జాతీయం చేసింది? అప్పుడు ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తే బిజెపి మాతృసంస్థ భారతీయ జనసంఘం మాత్రం వ్యతిరేకించింది. కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెట్టడం అనేది ఆ పార్టీ రక్తంలోనే ఉంది.
ఒకటో, రెండో తప్ప తక్కిన ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీలన్నీ భారీ నష్టాల్లో కూరుకుపోయి వున్నాయి. బ్యాంకులకు బకాయిలు పడి చేతులెత్తేశాయి (వీళ్ళకు అప్పులిచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకులే కావాలి). ఇప్పుడు ఆ అప్పుల్ని మాఫీ చేసి ప్రైవేటు స్టీల్‌ కంపెనీలను కాపాడే పనిలో ఉన్నారు బిజెపి నేతలు. విశాఖ ఉక్కు మెడకు మాత్రం ఉరి బిగిస్తున్నారు.
విశాఖ అభివృద్ధికి మూలం ప్రభుత్వ రంగమే
ప్రైవేటు రంగంలో మొదలైన సింధియా నావిగేషన్‌ కంపెనీని యజమాని వాల్‌చంద్‌ హీరాచంద్‌ నడపలేక మొరపెట్టుకుంటే దానిని జాతీయం చేసి హిందూస్తాన్‌ షిప్‌యార్డుగా ఇప్పటికీ దిగ్విజయంగా నడుపుతున్నారు.
అమెరికన్‌ కంపెనీగా ఉండిన కాల్టెక్స్‌ ఆయిల్‌ రిఫైనరీ దేశ అవసరాలకు తగినట్టు విస్తరించడానికి సిద్ధం కాకపోతేనే దానిని జాతీయం చేసి హెచ్‌పిసిఎల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సంస్థ విస్తరించిన వైనం చూస్తే జివిఎల్‌ గారికి ప్రభుత్వ రంగం అంటే ఏమిటో కాస్తంతైనా తెలుస్తుంది. విశాఖ-చెన్నై కోస్టల్‌ కారిడార్‌ కి హెచ్‌పిసిఎల్‌ విస్తరణ పునాది.
కొద్ది సంవత్సరాల క్రితం 'హిందూస్తాన్‌ జింక్‌' అనే ప్రభుత్వ రంగ సంస్థను 'వేదాంత' అనే ప్రైవేటు కంపెనీకి అమ్మేశారు. ఇప్పుడు 'వేదాంత' యజమాని ఆ జింక్‌ సంస్థను మూసేసి ఆ స్థలాలను సైతం అమ్మకానికి పెట్టాడు. ఇదీ ప్రైవేటు ఘనత, ఇక కాలుష్యంతో విశాఖ ప్రజలను పరుగులెత్తించిన ఘనత మరో ప్రైవేటు కంపెనీ 'ఎల్‌.జి పాలిమర్స్‌' కి చెందుతుంది.
రాష్ట్ర ప్రజానీకాన్ని పక్కదోవ పట్టిస్తున్న బిజెపి
ఇవన్నీ జివిఎల్‌ వంటి పెద్దవారికి తెలియవని అనుకోవాలా? తెలిసీ చర్చకు సిద్ధం అంటున్నారంటే అసలు సంగతి ఏమిటి? విశాఖ ఉక్కు పై జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడమే ఈ సవాలు వెనక అసలు ఉద్దేశ్యం. ప్రభుత్వ రంగమా, ప్రైవేటా అని, నష్టాలు వస్తే ఏంచేయాలి అని చాలా అమాయకంగా అడిగినట్టు చర్చలు రేగ్గొట్టి గందరగోళం సృష్టించడం.
నష్టాలు వచ్చిన ప్రైవేటు కంపెనీలను మాత్రం కాపాడతారు. విశాఖ ఉక్కుకు నోషనల్‌ నష్టాలు వచ్చినా అమ్మేయాల్సిందేనంటారు. ఇక్కడ బ్యాంకు అప్పులను మాఫీ చేయడం గురించి నోరు మెదపరు. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఆపరేషనల్‌ లాభాలు వస్తున్నాయన్న వాస్తవాన్ని గమనించనట్టే నటిస్తారు.
ఈ దొంగనాటకం ఇక కట్టిపెట్టండి! విశాఖ ఉక్కు ప్రజల ఉమ్మడి ఆస్తి. తెలుగువారంతా కలిసి ఉద్యమించి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్న ఆస్తి. మీకు ఆ పోరాటంలోనూ ఎటువంటి పాత్రా లేదు, ఇప్పుడు అమ్మేసే హక్కూ లేదు.
విశాఖ ఉక్కు కోసం అమరులైన 32 మంది త్యాగమూర్తులది ఈ విశాఖ ఉక్కు. ఆ ప్రాణాలకు విలువ కట్టి చెల్లించగలిగినంత సొమ్ము మీ కార్పొరేట్ల దగ్గరుందా? అసలు విలువ కట్టగలిగే దమ్ము ఉందా?
వేల ఎకరాల భూములను, తమ కుటుంబాలు తరతరాలుగా బతుకుతున్న ఆ భూములను విశాఖ ఉక్కు కోసం అప్పజెప్పిన వేలాది నిర్వాసితులది ఈ విశాఖ ఉక్కు. ఆ కుటుంబాల భావి తరాలవారికి చెప్పేందుకు జివిఎల్‌ గారి దగ్గర సమాధానం ఉందా?
తమ రెక్కల కష్టంతో విశాఖ ఉక్కును నడిపిస్తున్నారు ఉక్కు కార్మికులు. ఆసియా ఖండంలోనే విశిష్టమైన ప్లాంట్‌గా పేరు తెచ్చిపెట్టారు. ఆ ప్లాంట్‌ నడుపుతూ, ప్రమాదకరమైన జోన్‌లలో సైతం ప్రాణాలకు తెగించి శ్రమించారు. అనేకులు ప్రాణాలను కోల్పోయారు. తమ పరిశ్రమను నడుపుతూ ప్రాణం కోల్పోయిన ఒక్క కార్పొరేట్‌ యజమాని పేరైనా చెప్పగలరా జివిఎల్‌ గారు? విశాఖ ఉక్కుకు ఇబ్బందులు వచ్చిన ప్రతీసారీ పోరాడి రక్షించుకుంటున్నారు ఉక్కు కార్మికులు. ఆ ఐక్య కార్మిక వర్గానికి చెందిన సంపద విశాఖ ఉక్కు. వెంట్రుకవాసి సహాయం కూడా విశాఖ ఉక్కుకు చేయని బిజెపి ప్రభుత్వానికి అమ్మేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం విశాఖ ఉక్కు అమ్మకం నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. ప్రజల మనోభావాలు గాయపడడం గురించి బిజెపి నేతలే అందరికన్నా ఎక్కువగా (ఎక్కువ సార్లు అసందర్భంగా) మాట్లాడుతుంటారు. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలు మాత్రమే గాక పది కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలు కూడా కేంద్రం నిర్ణయం కారణంగా గాయపడ్డాయి. మరి ఇప్పుడైనా మోడీ సర్కారు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుందా? లేక ఈ తెలుగువాడు గాయపడినా నాకేం లెక్కలేదు అని బేఖాతరు చేస్తుందా?

                                                                                 - ఎం.వి.ఎస్‌. శర్మ