Jan 05,2021 09:22

ఒకసారి గనుక రైతులు, కూలీలు అప్పులబారిన పడితే...వారు అలాగే మరింతగా దిగజారడం, దరిద్రులవడం ఎవరూ ఆపలేరు. ఎందుకంటే, ధరల పతనాన్ని రైతుల మీదకు నెట్టే కార్పొరేట్లు...అదే ధరలు గనుక పెరిగితే దానివలన వచ్చే ప్రయోజనాలను మాత్రం మొత్తంగా వారే చేజిక్కించుకుంటారు. అందుచేత ధరలు పడిపోయిన కారణంగా అప్పులపాలైన రైతులు ధరలు పెరిగినా ఆ అప్పుల నుండి కోలుకోవడం జరగదు.
ఆ అప్పు అలా రైతు మెడకు గుదిబండలా అంటిపెట్టుకునే వుంటుంది.

     ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు కరెక్టుగా అసలైన సమస్యనే ఎంచుకున్నారు. అది రైతు ఎలా బతకాలి? అన్న సమస్య. ఇంతవరకూ దేశంలో రైతును బతికించి వుంచిన ఒక విధానం అమలులో ఉంది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా అది క్రమంగా శిధిలం అయిపోతూ వచ్చినా, అది ఇంకా అమలు లోనే ఉంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలూ సరిగ్గా ఆ జీవనాధారాన్నే రైతుకు లేకుండా చేస్తున్నాయి. ఈ చట్టాలు నయా ఉదారవాద విధానాల అమలుకు పరాకాష్ట. అందుకే నయా ఉదారవాద విధానాల అమలుకు కట్టుబడ్డ మోడీ ప్రభుత్వానికి, ఈ మూడు చట్టాలనూ రద్దు చేయాలంటున్న రైతాంగానికీ మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరడానికి అవకాశమే లేకుండా పోయింది. నయా ఉదారవాద విధానాల బాట నుండి వైదొలగితేనే ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయగలదు. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ చట్టాలు రద్దు కాకుంటే రైతు బతకడం సాధ్యం కాదు. అందుకే రైతులు పోరాటం నుండి వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు.
     స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి అడ్డూ, ఆపూ లేని పెట్టుబడిదారీ విధానాన్ని వ్యవసాయ రంగం లోకి జొప్పించే చట్టాలు చేసింది మోడీ ప్రభుత్వం. సహజంగానే దీనివలన అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లు, విదేశీ బహుళజాతి అగ్రి బిజినెస్‌ సంస్థలు ప్రధానంగా లబ్ధి పొందుతాయి. ఈ పాయింటు స్పష్టం కావాలంటే మనకు ఇంతవరకూ జరిగిన వ్యవసాయ రంగ పరిణామాలకు, ఇప్పుడు మోడీ తలపెట్టిన మార్పులకు మధ్య తేడా బోధపడాలి.
     1970 దశకం లోనే మన దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి గురించి చాలా చర్చ జరిగింది. గత యాభై సంవత్సరాలుగా పెట్టుబడిదారీ విధానం వ్యవసాయ రంగంలోకి చొచ్చుకుని వస్తూనే వున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదో జరిగిపోతోందన్న అలజడి ఎందుకు? ఆ పెట్టుబడిదారీ విధానం యాభై సంవత్సరాలుగా చొరబడుతున్నా అదృశ్యం కాని రైతాంగం ఇప్పుడు మాత్రం కనుమరుగైపోతుందని ఆందోళన ఎందుకు? -ఇవీ ముందుకు వచ్చే ప్రశ్నలు.
     ఇంతవరకూ వ్యవసాయ రంగంలో జరిగిన పెట్టుబడిదారీ పరిణామం అంతా అంతర్గతంగా జరిగింది. భూస్వాములు, కొన్ని తరగతుల రైతులు ప్రవేశ పెట్టిన పెట్టుబడిదారీ పద్ధతులు అవి. వెలుపల నుండి పెట్టుబడిదారీవర్గం ఇందులో చొరబడడాన్ని పాలక యంత్రాంగం గట్టిగా నిరుత్సాహ పరచింది. అందులో భాగంగానే కనీస మద్దతు ధర, సేకరణ విధానం, సబ్సిడీ ధరలకు ప్రజా పంపిణీ వంటివి అమలు జరిగాయి. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తిదారులు ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగానికి, ఇంకోవైపు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ మార్కెట్‌కు మధ్య అడ్డంగా పాలక ప్రభుత్వం నిలబడింది. అందుచేత వెలుపల నుండి పెట్టుబడిదారీ వర్గం ప్రవేశించకుండా అంతర్గతంగా ఏమేరకు వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి కాగలదో, ఆ మేరకే వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ సంబంధాలు ప్రవేశించాయి.
     పెట్టుబడిదారీ విధానం వెలుపలి నుండి వ్యవసాయ రంగం లోకి ప్రవేశించాలంటే ఇప్పుడున్న రైతు-ఆధారిత వ్యవసాయాన్ని 'సాధారణ సరుకుల ఉత్పత్తి' విధానం పరిధి లోకి లాక్కుని రావాలి. అటువంటి సరుకుల ఉత్పత్తి విధానం ద్వారానే రైతు- ఆధారిత వ్యవసాయాన్ని నాశనం చేయడం సాధ్యపడుతుందని వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిపై ప్రతిపాదించిన సిద్ధాంతంలో రోజా లక్సెంబర్గ్‌ నొక్కిచెప్పారు.
అయితే ఇక్కడ సరుకుల ఉత్పత్తి విధానం అంటే ఏమిటో స్పష్టత ఉండాలి. మార్కెట్‌లో అమ్ముడుపోయేందుకు చేసే ఉత్పత్తి అనో, సరుకు-డబ్బు-సరుకు చక్రంలో డబ్బు కోసం మారకం వేసేది గానో అనుకుంటే సరిపోదు. సరుకుల ఉత్పత్తి విధానం సంపూర్ణ రూపంలో జరిగే చోట కొనుగోలుదారుడు సరుకు ఉపయోగపు విలువను, మారకపు విలువను పొందుతాడు కాని అమ్మకందారుడికి కేవలం ఆనాటి మార్కెట్‌ పరిస్థితులు నిర్ధారించిన మారకపు విలువ మాత్రమే నగదుగా ముడుతుంది.
      పెద్ద ఉత్పత్తిదారులు చిన్న ఉత్పత్తిదారులను మింగేయడం సరుకుల ఉత్పత్తి విధానపు ఒకానొక ముఖ్య లక్షణం. ప్రస్తుత సందర్భానికి దీనిని వర్తింపజేస్తే రైతులను కార్పొరేట్లు మింగేయడం జరుగుతుందని అర్ధం అవుతుంది. సరుకుల ఉత్పత్తి విధానం ద్వారా రైతులు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు చిక్కుకుపోయినప్పుడే ఇలా జరుగుతుంది. ఇప్పుడు కనీస మద్దతు ధర, సేకరణ విధానం ఉన్నందున కేవలం మార్కెట్‌ పరిస్థితులే పంటల ధరను నిర్ణయించేందుకు అవకాశం లేదు. పెట్టుబడిదారీ మార్కెట్‌ రైతులను స్వాహా చేయకుండా అడ్డుకుంటున్నది ఇప్పుడున్న కనీస మద్దతు ధర విధానం, సేకరణ విధానం మాత్రమే.
    నయా ఉదారవాదం మార్కెట్‌ శక్తులు మాత్రమే సరుకుల ధరలను నిర్ణయించే పరిస్థితిని తిరిగి నెలకొల్పాలని కోరుకుంటుంది (గతంలో వలస పాలన కాలంలో ఇటువంటి స్థితి ఉండేది). ఆ కోరిక నెరవేరాలంటే ప్రస్తుత మద్దతు విధానాన్ని కూలగొట్టాలి. నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలయ్యాక అంతకు పూర్వం రైతులకు రక్షణగా ఉన్న పలు విధానాలకు ఒకటొకటిగా స్వస్తి పలుకుతూ వచ్చారు. దాంతో రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతుల ఆత్మహత్యల పర్వం మొదలైంది. ఎన్ని మార్పులు జరిగినా, ప్రస్తుత విధానానికి మూల స్తంభం వంటి కనీస మద్దతు ధర, ధాన్య సేకరణ, ప్రజా పంపిణీ మాత్రం కొనసాగుతూనే వున్నాయి. ఇంతవరకూ వచ్చిన ఏ ప్రభుత్వమూ ఈ మూల స్తంభాన్ని కూలదోసేంతగా రైతుల విషయంలో బండబారిపోలేదు. ఈ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నింటినీ మించిపోయి రైతుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ల దాహానికి రైతాంగం బలిగాకుండా వారికి రక్షణగా నిలిచిన వ్యవస్థను కూలదోసేందుకే నిర్ణయించుకుంది. దీని పర్యవసానంగా రైతులు కూలీలుగానో, ఎప్పుడు నచ్చకుంటే అప్పుడు వెళ్ళగొట్టబడే కౌలుదారులుగానో దిగజారిపోయే ప్రమాదం దాపురించింది.
     ఈ విధంగా బడా కార్పొరేట్ల సారథ్యంలో నడిచే పూర్తి స్థాయి సరుకుల ఉత్పత్తి విధానపు మార్కెట్‌ వ్యవస్థకు రైతులను గురిచేయడం వలన, ప్రభుత్వం ఆ మార్కెట్‌లో ఏ జోక్యమూ చేసుకోకుండా వుండడం వలన మూడు మౌలిక మార్పులు జరుగుతాయి. మొదటిది- మన వ్యవసాయ భూములపైన విదేశీ మార్కెట్‌ పెత్తనం పెరుగుతుంది. మార్కెట్‌లో ఎవరి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుందో వారి పెత్తనమే సాగుతుంది. వారు కోరుకునే పంటలనే మన భూములలో పండించవలసిన అగత్యం ఏర్పడుతుంది. రెండవది- ప్రస్తుతం సంపన్న దేశాలు మనవంటి ఉష్ణ దేశాల భూముల్లో ఆహార పంటలు కాకుండా ఇతర పంటలను సాగు చేయాలని కోరుతున్నారు. అందుచేత పూర్తి స్థాయి సరుకుల ఉత్పత్తి విధానం వలన ఆహార ధాన్యాల సాగుకు బదులు ఇతర పంటల వైపు మన భూవినియోగం మారుతుంది. దీని పర్యవసానంగా మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మన దేశీయ అవసరాలకన్నా దిగువ స్థాయికి పడిపోయి తిండి కోసం దిగుమతులపై ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. మూడవది- ముందే చెప్పినట్టు మన రైతులు కార్పొరేట్ల ఇష్టారాజ్యానికి బలై తమ ఆర్థిక స్తోమతను కోల్పోతారు. ఈ పరిణామం పలు విధాలుగా జరగవచ్చు. అందులో ఒకటి ఇలా ఉంటుంది; ప్రపంచ మార్కెట్‌ డిమాండ్‌ ప్రకారం కార్పొరేట్ల వత్తిడి ఫలితంగా రైతులు వ్యాపార పంటలను పండించడం ప్రారంభిస్తారు. ఏ ఏడాదిలోనైనా పంట దిగుబడి పడిపోయినా, లేక మార్కెట్‌లో ధరలు పడిపోయినా (కాంట్రాక్టులో ఏం రాసుకున్నా ధరలు పడిపోతే అంతిమంగా ఆ భారం రైతుల మీదే పడుతుంది) దాని ఫలితంగా రైతులు అప్పుల పాలవుతారు. ఒకసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే దానినుండి బైటకు రాలేక తమ భూములను కోల్పోయి కూలీలుగా దిగజారతారు.
వలస పాలన కాలంలో జరిగిందిదే. కనీస మద్దతు ధర గాని, సేకరణ విధానం గాని, ఏ ఇతర రూపంలో సహాయం గాని ప్రభుత్వం వైపునుంచి లేకపోవడంతో రైతు మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలివేయబడ్డాడు. 1930, 1940 దశకాల్లో ఆనాడు దేశీయ సాహిత్యంలో పలు భాషల్లో రైతుల దుర్భర పరిస్థితుల హృదయ విదారక గాధలు రచనలుగా వచ్చాయి. ఆ అనుభవాలు మన ముందే ఉన్నా, ఎటువంటి నియంత్రణా లేని మార్కెట్‌ దోపిడీకి మన రైతాంగ వ్యవసాయాన్ని విడిచి పెట్టడం మంచిదేనంటూ సమర్ధిస్తున్న కొందరు మేధావులు వున్నారు. వారికి తమ దేశ చరిత్ర బొత్తిగా ఏమీ తెలియదని అనుకోవాలి. బిజెపి కి మన దేశ చరిత్ర గురించి ఏమీ తెలియదన్న సంగతి మనకు ముందే తెలుసు. కాని పలువురు బిజెపి-యేతర మేధావులు కూడా పెట్టుబడిదారీ మార్కెట్‌ తాలూకు సరుకుల ఉత్పత్తి విధానం మంచిదని, ప్రభుత్వ జోక్యం ఉండరాదని వాదిస్తూ ఊహాలోకాల్లో విహరించడాన్ని ఏమనాలి?
     పూర్తి సరుకుల ఉత్పత్తి విధానం రైతుల దారిద్య్రాన్ని బాగా పెంచుతుంది. మన దేశంలో రైతుల స్థితిగతులు గనుక దిగజారితే దానితోబాటు మొత్తం శ్రామిక ప్రజల పరిస్థితులు కూడా దిగజారతాయి. మొత్తంగానే శ్రమజీవుల పేదరికం పెరుగుతుంది. ఆహార పంటల నుండి వ్యాపార పంటలకు మారినప్పటికీ ఎకరాకు కల్పించబడే పని దినాలు ఏమీ తగ్గలేదని వాదన కోసం అనుకుందాం (పని దినాలు తగ్గితే పేదరికం పెరుగుతుంది. ఈ విషయం స్పష్టం). అలాగే ఈ మార్పు వలన రైతుల, వ్యవసాయ కూలీల తలసరి ఆదాయమూ ఏమీ తగ్గలేదని అనుకుందాం. అలా అనుకున్నా, ఒక్క ఏడాదిలో గనుక వ్యాపార పంటల ధరలు పడిపోతే రైతుల, కూలీల ఆదాయాలు పడిపోతాయి. వారు అనివార్యంగా అప్పులపాలవుతారు.
     ఒకసారి గనుక రైతులు, కూలీలు అప్పులబారిన పడితే...వారు అలాగే మరింతగా దిగజారడం, దరిద్రులవడం ఎవరూ ఆపలేరు. ఎందుకంటే, ధరల పతనాన్ని రైతుల మీదకు నెట్టే కార్పొరేట్లు...అదే ధరలు గనుక పెరిగితే దానివలన వచ్చే ప్రయోజనాలను మాత్రం మొత్తంగా వారే చేజిక్కించుకుంటారు. అందుచేత ధరలు పడిపోయిన కారణంగా అప్పులపాలైన రైతులు ధరలు పెరిగినా ఆ అప్పుల నుండి కోలుకోవడం జరగదు. ఆ అప్పు అలా రైతు మెడకు గుదిబండలా అంటిపెట్టుకునే వుంటుంది. దాని నుండి తప్పించుకోడానికి చాలా మంది రైతులు పట్టణాలకు ఉద్యోగాల కోసం వలసలు పోతారు. దాని వలన ఉద్యోగార్ధులు పెరిగి పట్టణాల్లో కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. చివరకు సంఘటిత కార్మికుల పైన సైతం దీని ప్రభావం ఉంటుంది.
   అందుచేత రైతులు చేస్తున్న ఆందోళనల వెనుక కేవలం మూడు చట్టాల రద్దు మాత్రమే కాదు. మొత్తం రైతాంగం మనుగడ కొనసాగుతుందా..లేదా..అన్న సవాలు వుంది.
 

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

prabhat patnaik