కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు బిగించిన పిడికిలి ఉక్కు సంకల్పం అప్రతిహతంగా సాగుతూ రైతాంగ ఉద్యమాల సరి కొత్త చరిత్రను లిఖిస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎడ్లబండ్లతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై సాగిస్తున్న బైఠాయింపు ఇప్పటికే ప్రపంచం దృష్టినాకర్షించింది. కేంద్రం మొండిగా వ్యవహరించినా, రైతులను సంఘవిద్రోహ శక్తులని రెచ్చగొట్టినా, ఇసుమంతైనా వెనక్కి తగ్గలేదు. సరికదా 19 రోజులుగా ఏకబిగువున సాగిస్తున్న పోరాటం రోజు రోజుకూ మరింత ఉధృతం, విస్తృతం కావడం సాధారణ విషయం కాదు. రైతుల పోరాటానికి వందలాది రైతు సంఘాలు, పాతిక వరకు రాజకీయ పార్టీలు, ఎన్నో ప్రజాసంఘాలు, మేధావుల విశాల మద్దతు, సంఘీభావం లభిస్తోందంటే రైతుల డిమాండ్‌లో సహేతుకత నిబద్ధత స్పష్టం. రైతన్నలు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదు. వ్యవసాయ చట్టాలు తెచ్చిపెట్టే దుష్పరిణామాలు రైతులకే పరిమితం కాదు. యావత్ దేశ ప్రజలనూ చుట్టుముట్టే సమస్యలు. అశేష ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు చట్టాలతో ముప్పు వాటిల్లుతుంది. జాతికి అన్నం పెట్టే రైతుల చేతులను నరికేయొద్దని పోరాటం ఉద్బోధిస్తోంది.
ప్రజలు, ప్రధానంగా రైతులు కరోనా సంక్షోభంతో కూరుకున్న సమయంలో మోడీ సర్కారు వినాశకర వ్యవసాయ చట్టాలపై ఎలాంటి చర్చా లేకుండానే ఆర్డినెన్స్‌లు తెచ్చింది. అప్పుడే రైతుల్లో ఆందోళనలు బయలుదేరగా, మొన్న పార్లమెంట్ సమావేశాల్లో చట్ట రూపం తీసుకున్నాక మిన్నంటాయి. పంజాబ్ రైతులకే ఉద్యమం పరిమితమని బిజెపి తక్కువ చేయగా, ఢిల్లీ ముట్టడి దరిమిలా బిజెపి రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలను చుట్టుముట్టింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా రాజస్థాన్ రైతులు ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్బంధించి కేంద్రం వెన్నులో వణుకు పుట్టించారు. అయినప్పటికీ రైతుల పోరాట విస్తృతిని మోడీ సర్కారు గుర్తించ నిరాకరించడానికి కారణం అదానీ, అంబానీల ప్రయోజనాను నెత్తికెత్తికోవడమే. ఇంకా మాయ మాటలు చెప్పి చర్చలతో కాలయాపన చేసేందుకు, చట్టాల సమూల రద్దు కాకుండా కొన్ని సవరణలు చేస్తామని మోడీ ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అక్కడితో ఆగకుండా కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ, రామ మందిరం విషయంలోనూ విపక్షాలు విమర్శించాయంటూ రైతాంగ పోరాటానికి రాజకీయ రంగు పులిమేందుకు బరి తెగించారు. పోరాటంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించారని నెపం మోపి బలవంతంగా అణచేసే దుష్ట పన్నాగాలకు ఒడిగడుతున్నారు.
మన దేశం పూర్తి వ్యవసాయ దేశం. 70 శాతం మంది ప్రజలు ఆ రంగంపై ఆధారపడి జీవనోపాధి వెళ్లదీస్తున్నారు. ప్రత్యక్షంగా 20 కోట్ల మంది సాగుదార్లు ఉన్నారు. దేశ జనాభా 130 కోట్ల మందికి అవసరమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వీరు భుజానికెత్తుకున్నారు. సరళీకరణ విధానాలొచ్చాక పాలకుల దృష్టిలో మార్పొచ్చింది. అప్పటి వరకు ప్రజలకు ఆహార భద్రత లక్ష్యం కోసం అంకురించిన హరిత విప్లవ స్ఫూర్తి స్థానంలో ప్రైవేటు, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలు పుట్టుకొచ్చాయి. మోడీ సర్కారు వాటిని దూకుడుగా అమలు పర్చేందుకు కొత్త చట్టాలు తెచ్చింది. అవే రైతుల హితం అని నిరంకుశంగా వ్యవహరిస్తోంది. స్వేచ్ఛా మార్కెట్ రైతులకు కాదు కార్పొరేట్లకేనన్న ప్రభుత్వ కుట్రను గ్రహించిన రైతాంగం రోడ్డెక్కారు. రైతులకు మద్దతు ధర, పిడిఎస్ కోసం రైతుల నుంచి ఆహార ధాన్యాల సేకరణ, ఆహార పదార్ధాల వ్యాపారుల నిల్వలపై పరిమితులు, ఇత్యాది రక్షణ చర్యలు బహిరంగ విపణిలో ప్రజల నిత్యావసరాల ధరలను కొంతైనా సుస్థిరం చేస్తాయి. అవి వద్దే వద్దని బిజెపి చట్టాలు చేసింది. కార్పొరేట్ల దోపిడీకి జై కొడుతూ రైతులను వారికి ఎర వేస్తోంది. కాబట్టి రైతులు ఎత్తిన పోరాట బావుటా కేవలం తమను తాము రక్షించుకోవడానికే కాదు. ప్రజలందరినీ రక్షించడం కోసం. రైతుల పోరాటంపై యావత్ పౌర సమాజానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది.










