35 కోట్లకు పైగా గ్రామీణ పేదలు వ్యవసాయం, గ్రామీణ ఉపాధి హామీ పథకంపౖౖె ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రెండింటిపై వచ్చే ఆదాయంలో కోతలు విధించడంలో 2022-23 కేంద్ర బడ్జెట్ మరొక అడుగు ముందుకేసి... ఉపాధి హామీ పథకానికి 25.5 శాతం కోత విధించింది. గత సంవత్సరం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకుండా నిలిపి వేయడంతో అనేక వినాశనకర ప్రభావాలను చవిచూడాల్సి వచ్చింది. గతం కంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ప్రజలను బాగా దెబ్బతీస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నిధుల కొరతతో ఉపాధి హామీ పథకం ద్వారా అందే ఆర్థిక మద్దతు లేకుండా పోయింది.
ఏ ప్రభుత్వమైనా విధానాల రూపకల్పనలో ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ప్రజల స్థితిగతులను దృష్టిలో వుంచుకుంటుంది. కానీ బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం...ప్రజలు పడుతున్న బాధలను, వాటిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలను ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో విస్మరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్న పేదలు గతంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఆదాయాల తగ్గుదల, అధిక ధరలు, బలహీన ఆరోగ్య వ్యవస్థ, భారీ సబ్సిడీ కోతలు లాంటి సమస్యలతో అవస్తలు పడుతున్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోకుండా, తన కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్లతో భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలపై ఈ బడ్జెట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
సాధారణంగా ఉపాధి, ఆహారం, ఆరోగ్యం, విద్య, సామాజిక సమానత్వం, భూమి, సామాజిక భద్రతా పెన్షన్లు, ప్రత్యక్ష నగదు మద్దతు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లాంటి అంశాలు వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల జీవితాలపై అనుకూల ప్రభావం చూపుతాయి. బడ్జెట్లో వీటికి తగినంత కేటాయింపులు లేకపోవడంతో వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
భారత దేశంలో 35 కోట్లకు పైగా గ్రామీణ పేదలు వ్యవసాయం, గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ)పై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రెండింటిపై వచ్చే ఆదాయంలో కోతలు విధించడంలో 2022-23 యూనియన్ బడ్జెట్ మరొక అడుగు ముందుకేసి... ఉపాధి హామీ పథకానికి 25.5 శాతం కోత విధించింది. 2020-21 కరోనా మొదటి దశలో కూడా బడ్జెట్ కేటాయింపుల్లో 41 శాతం కోత విధించింది. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఉపాధి హామీ పథకం కింద ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలంటే సుమారు రూ.2.64 లక్షల కోట్లు అవసరమని అంచనా వేసింది. గత సంవత్సరం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కొనసాగించకుండా నిలిపి వేయడంతో అనేక వినాశనకర ప్రభావాలను చవిచూడాల్సి వచ్చింది. గతం కంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ప్రజలను బాగా దెబ్బతీస్తున్న తీరును మనం చూస్తున్నాం.ఈ సంవత్సరం కూడా నిధుల కొరతతో ఉపాధి హామీ పథకం ద్వారా అందే ఆర్థిక మద్దతు లేకుండా పోయింది.
అనివార్యమైన యాంత్రీకరణ వల్ల వ్యవసాయ రంగంలో పని దినాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో సగటు పని దినాలు గరిష్ఠంగా 50 రోజుల కంటే మించి లేవు. ప్రపంచీకరణ విధానాలు, గ్రామీణ వృత్తిదారుల సాంప్రదాయ పనులను లాగేసిన ఫలితంగా వారంతా కూడా వ్యవసాయ కార్మికులుగా మారారు. కోవిడ్-19 తరువాత పట్టణ, నగర ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలొచ్చిన ఒక కొత్త తిరోగమన విధానాన్ని మనం చూశాం. ఇది కూడా వ్యవసాయ కార్మిక శక్తి అదనంగా పెరగడానికి కారణమైంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువగా నీటి ట్యాంకుల నిర్మాణం, రోడ్డు రిపైర్లు, సాగుభూమి అభివృద్ధి, అటవీ భూముల అభివృద్ధి, పండ్ల తోటలు లాంటి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఉంటాయి. ఉపాధి హామీకి బడ్జెట్లో కోత విధించడమంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచడమే. ఇది ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడే వ్యవసాయ కూలీల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 23 కోట్లకు పైగా రేషన్ కార్డులతో 85 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రజలకు ఆహారాన్ని అందించే విషయంలో మన దేశం ఆకలి సూచికలో 101వ స్థానంలో ఉన్నది. 75 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా, అవసరానికి మించి రెట్టింపు ఆహారధాన్యాలను ఎఫ్‌సిఐ నిలువ చేస్తున్నప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార సబ్సిడీలను పెంచాలని మనం కోరుతున్నాం. కానీ 2021-22 సవరించబడిన బడ్జెట్లో రూ.2,86,269 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత బడ్జెట్‌లో అది రూ.2,06,831 కోట్లకు (అంటే 27 శాతం) తగ్గించారు. ఈ సంఖ్య రెట్టింపు చేయకపోయినా, ప్రభుత్వ వ్యయం రెట్టింపు చేయకపోయినా కొద్ది నెలల్లో మన గ్రామాలలో ఆకలి నెలకొంటుంది. ఇప్పటికే దిగువనున్న 20 శాతం జనాభా ఆదాయం 53 శాతానికి పడిపోయింది.
ఆహార సబ్సిడీలలో కోత అంటే రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించదని అర్థం. ఇది రైతులు పండించిన వరి, గోధుమకు కనీస మద్దతు ధర కోసం చేసిన కేటాయింపుల (రూ.1100 కోట్లు) తగ్గుదలలో ప్రతిబింబిస్తున్నది. కేటాయింపుల తగ్గుదల, ద్రవ్యోల్బణం వలన మొత్తంగా 2022-23లో ధాన్య సేకరణ గణనీయంగా తగ్గి, ఆహార ధాన్యాలు, ఇతర ఆహార వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆహార సబ్సిడీల తగ్గింపు, దుర్బలమైన ప్రజా పంపిణీ వ్యవస్థ కారణంగా ఆహార ధాన్యాల మార్కెట్ పై కార్పొరేట్ల అదుపు పెరుగుతుంది.
మెజారిటీ ప్రజలు ప్రజా ఆరోగ్యవ్యవస్థపై ఆధారపడతారు. 80 శాతం మించి పేద ప్రజలు ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ ఖర్చును భరించలేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను రక్షించుకున్న పరిస్థితిని కరోనా రుజువు చేసింది. ఆరోగ్య సంరక్షణకు, వైద్య పరికరాల పరిశ్రమకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కరోనా రెండో దశలో భారీ మరణాలు నమోదు చేసుకున్న మన దేశానికి ఈ బడ్జెట్ పెద్ద దెబ్బ. నేటికి కూడా జిడిపి లో ఆరోగ్య సంరక్షణకయ్యే ఖర్చు కోసం 3 శాతం పక్కకు పెడతామన్న ప్రభుత్వ వాగ్దానాన్ని నెరవేర్చ లేదు. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1.3 శాతం మాత్రమే కేటాయించారు. 2021-22 ఆరోగ్య రంగానికి బడ్జెట్ అంచనాలు రూ.74,602 కోట్లు, సవరించిన అంచనా రూ.85,915 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 0.8 శాతం (రూ.86,606 కోట్లు) పెంచారు. కరోనా ఇంకా అంతం కాలేదు. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య రంగానికి చేసిన అరకొర కేటాయింపులు పేదలను ప్రమాదంలోకి నెట్టివేస్తాయి.
కోవిడ్-19 వ్యాప్తి కాలంలో, వరుస లాక్‌డౌన్‌లతో విద్యా సంస్థలు మూతపడి, ఆన్‌లైన్ బోధన సాగింది. ''స్కూల్ చిల్డ్రన్స్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ లెర్నింగ్'' ఆధ్వర్యంలో 15 రాష్ట్రాల్లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు 2021లో చేసిన సర్వే... 8 శాతం గ్రామీణ విద్యార్థులు, 24 శాతం పట్టణాలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యారని తెలిపింది. అంటే దేశంలో 3/4 వంతుల మంది విద్యార్థులు ఏ విధమైన శిక్షణ పొందలేకపోయారు. కాబట్టి, ప్రభుత్వ విద్యకు ఎక్కువ కేటాయింపులు చేసి, ప్రయివేటు మాఫియాను అదుపు చేస్తుందని ప్రజలు ఆశిస్తే, ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ వల్ల విద్యా సంస్థలు మూతపడ్డ రెండు సంవత్సరాల తరువాత విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ కేవలం 3 శాతం (రూ.103 కోట్లు) మాత్రమే పాఠశాల, ఉన్నత విద్యలకు కేటాయించారు.
''సాక్షమ్ అంగన్‌వాడీ'', ''పోషణ్ 2.0''కు 2022-23 బడ్జెట్ కేటాయింపులు రూ. 20, 263.07 కోట్లు, గత సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు రూ. 20,105 కోట్లు. ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకున్నట్లయితే బడ్జెట్ కేటాయింపులో అసలైన తగ్గింపు కనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి చేసిన కేటాయింపులు కూడా గణనీయంగా కోతకు గురయ్యాయి. ఈ పథకం అమలులోకి వచ్చిన తరువాత బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల నమోదు బాగా పెరిగింది. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి తక్కువ కేటాయింపులు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమవుతారు.
దేశ అవసరాలు తీరాలంటే ప్రభుత్వం ఉపాధి అవకాశాలను సృష్టించి, మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎం.ఎస్.ఎమ్.ఇ లకు మద్దతు ఇచ్చి బాలికల, మహిళల విద్యపై కేంద్రీకరించాలి. మహిళా శిశు అభివృద్ధికి రూ.25,172.28 కోట్లు, అంటే 2021-22లో కేటాయించిన రూ.24,435 కోట్లు (3 శాతం పెరుగుదల) కంటే కొంచెం ఎక్కువ కేటాయించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు 'సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ', 'నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్', 'నేషనల్ కమిషన్ ఫర్ విమిన్'లకు 2021-22లో రూ.188క ోట్లు కేటాయిస్తే, 2022-23లో రూ.153 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ పని పైనే ఆధారపడి జీవిస్తారు. మన జిడిపి లో వ్యవసాయ రంగం 16 శాతం (కొన్ని రాష్ట్రాలు 20 శాతం) వాటాను కలిగి ఉంది. కానీ, బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి జిడిపి లో 1.57 శాతం మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం 'ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన'కు రూ.16 వేల కోట్ల కేటాయిస్తే ఇప్పుడు రూ.15,500 కోట్లకు తగ్గించారు. 2019లో ప్రారంభించిన 'పి.ఎం-కిసాన్'కు అప్పుడు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు 9 శాతం తగ్గించి, ఫెర్టిలైజర్ సబ్సిడీలను గణనీయంగా 25 శాతానికి తగ్గించారు.
మూడు రైతు చట్టాల ద్వారా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ప్రభుత్వ ప్రయత్నాలను రైతు పోరాటం తిప్పి కొట్టింది. కానీ, ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేసింది. ఇది బిజెపి వర్గ దృష్టిని తెలుపుతుంది. కాబట్టి పండించిన పంటకు కనీస మద్దతు ధర రైతులకు అందదు.
ప్రధాన ఉత్పత్తిదారులైన వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలకు భూమి లేదు. వేల ఎకరాల సాగు భూమి ఉన్న భారతదేశంలో 20-25 శాతం భూమిని ఒక శాతంగా ఉన్న ధనికులు అదుపు చేస్తున్నారు. 35 కోట్ల మంది దళితులున్న మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు. వారు ఆర్థికంగా దోపిడీకి గురై, సామాజికంగా అణగదొక్కబడుతున్నారు. భారతీయ సమాజంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరికి బడ్జెట్‌లో చోటు లేకుండా పోయింది. ఉపాధి హామీ పథకం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలకు 2021-22లో సవరించిన వ్యయం 3.2 శాతం నుండి 2022-23 బడ్జెట్లో 2.5 శాతానికి కుదించారు. ఈ బడ్జెట్ ప్రయివేటీకరణను, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సాహిస్తుందంటే...సామాజికంగా అణగారిన వర్గాలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కూడా లేవు. ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించడంలోనూ ఈ బడ్జెట్ విఫలమైంది.
భారతదేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలున్నాయి. ఇవి కరోనా వ్యాప్తి కాలంలో మరింత పెరిగాయి. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం 84 శాతం కుటుంబాల ఆదాయం సంవత్సర కాలంలో గణనీయంగా తగ్గింది. కానీ, బిలియనీర్లు 102 నుండి 142కు పెరిగారు. భారతదేశంలో మొదటి 100 మంది ధనవంతుల సమిష్టి సంపద 2021లో రూ.57.3 లక్షల కోట్లు. ప్రభుత్వ విధానాలు కూడా ధనవంతులకే అనుకూలంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నాయి. మరిన్ని అసమానతలను పెంచే...పేద ప్రజలకు వ్యతిరేకంగా వున్న ఈ బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకమే.
/వ్యాసకర్త ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి /
బి.వెంకట్











