Sep 14,2023 21:01

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు

ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలో ఒకేసారి ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తుండటం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని, శిలా ఫలకాన్ని పరిశీలించారు. స్కిల్‌ ల్యాబ్‌, భయోకెమిస్ట్రి ల్యాబ్‌, హిస్టాలజి ల్యాబ్‌, లెక్చర్‌ హాల్స్‌ సందర్శించి, పలు మార్పులు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ర తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టి, వాటికే అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. టిటిడి మాజీ చైర్మన్‌ వె వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని తలపెట్టిందని చెప్పారు. వీటిలో ప్రస్తుతం ఐదు కళాశాలను ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది మరో 5, ఆ మరుసటి ఏడాది మిగిలిన ఏడింటిని పూర్తిచేసే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు.ఈ ఐదు వైద్య కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, డిసిఎంఎస్‌ చైర్పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు, ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి మురళీధర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణబాబు
వైద్య కళాశాలలో ఏర్పాట్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటి. కృష్ణబాబు పరిశీలించారు ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో ఏ విధంగా స్పందించాలో ఎలాంటి విషయాలను వివరించాలో స్కిల్‌, హిస్టాలజీ ల్యాబ్‌ ఇన్‌ఛార్జిలు, సాంకేతిక సిబ్బందికి సూచించారు. ముఖ్యమంత్రి విద్యార్థులతో సమావేశం కానున్న లెక్చర్‌ హాలును పరిశీలించారు. ఎల్‌ఇడి స్క్రీన్లు, లైవ్‌ టెలీకాస్టింగ్‌, సభా వేదిక ఏర్పాట్లను చూసి తగిన సూచనలు చేశారు. విద్యార్థులందరూ లెక్చర్‌ హాలు-1లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడనున్న విద్యార్థులను ముందు వరుసలో కూర్చేబెట్టాలని చెప్పారు. ఆయనతో పాటు కలెక్టర్‌, జెసి, ఆర్‌డిఒ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల, డిఎంహెచ్‌ఒ భాస్కరరావు తదితరులు ఉన్నారు.