యు.పిలో అన్నదాతలపై బిజెపి జరిపిన దాడి అత్యంత క్రూరమైన, అనాగరికమైన చర్య. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత మార్గంలో ఆందోళన చేస్తుంటే వాహనాలతో తొక్కించి నల్గురు రైతులను అమానుషంగా పొట్టన పెట్టుకున్న బిజెపి నాయకుల చర్యను ఖండించడానికి మాటలు చాలవు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఎంఎస్‌పి అమలుకు గ్యారంటీ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని గత పది మాసాలుగా ఆందోళన చేస్తున్న రైతులపై ఈ విధమైన దాడికి తెగబడడం దేశ చరిత్రలో బహుశా ఇదే ప్రథమం. చివరికి లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎస్‌కెఎం నాయకులను కానీ, ప్రియాంక, అఖిలేష్ యాదవ్, సతీష్ చంద్ర, సంజరు సింగ్ వంటి యు.పి నాయకులను కానీ అనుమతించకుండా ఎక్కడికక్కడ యు.పి ప్రభుత్వం నిర్బంధించింది. పంజాబ్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులను సైతం అడ్డుకుంది. ప్రజాస్వామ్యం గురించి అంతర్జాతీయ వేదికలపై విదేశీయుల ముందు లెక్చర్లిచ్చే ప్రధాని మోడీ, ఆచరణలో పచ్చి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. లఖింపూర్‌లో రాక్షసత్వంపై దేశ వ్యాపితంగా నిరసనలు హోరెత్తినా ప్రధాని ఈ ఘటనపై ఇంతవరకు నోరు మెదపకపోవడం విస్తుగొలుపుతోంది. హర్యానాలోని కర్నాల్, అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో బిజెపి ప్రభుత్వాలు రైతులపై పాశవికంగా దాడులు చేసినప్పుడూ ప్రధాని నోరు విప్పలేదు. ఇప్పుడు కూడా మూగనోము వీడకపోవడం దారుణం. సెప్టెంబరు 27న రైతుల చారిత్రాత్మక భారత్ బంద్ తరువాత ఓ ప్రైవేట్ టివి చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని రైతుల పోరాటాన్ని అవహేళన చేశారు. ఇది 'మేధోపరమైన కపటత్వం, ప్రతిపక్షాల రాజకీయ వంచన' అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే లఖింపూర్ ఘటన చోటు చేసుకుంది. అందుకే ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేము. దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉంది. నెల రోజుల క్రితం కేంద్ర మంత్రి అజరు మిశ్రా పబ్లిగ్గానే రైతులను బెదిరించాడు. మరీ దారుణమైన అంశమేమిటంటే లఖింపూర్ ఘటనకు కొద్ది సేపు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులను కర్రలతో కొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఉసిగొల్పడం. ఆందోళన చేస్తున్న రైతులను అణచివేసేందుకు ఉత్తర, పశ్చిమ హర్యానాలోని ప్రతి జిల్లా నుంచి వెయ్యిమందితో వలంటీర్ల దళం తయారై, రైతులు ఎక్కడ ఆందోళన చేసినా సామూహికంగా వారిపై దాడి చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా హింసను ప్రేరేపించడం, చట్టాలను అతిక్రమించండని పార్టీ కార్యకర్తలను ఎగదోయడం కాషాయ మార్కు రాజకీయాల రక్తదాహానికి సంకేతం. గత నెలలో కేంద్ర మంత్రి అజరు మిశ్రా తన స్వస్థలమైన లఖింపూర్ ఖేరిలో రైతులను బాహాటంగా సవాల్ చేస్తూ తాను తలచుకుంటే రెండు నిమిషాల్లో ఆందోళనలను అణచివేస్తానని హూంకరించారు. ఈ గ్రామం నుంచే కాదు, జిల్లా నుంచే రైతులను తరిమేస్తా, లఖింపూర్‌లోనైనా వేరే ఏప్రాంతంలోనైనా సరే తేల్చుకుందాం రండి అంటూ రైతులను సవాల్ చేశారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలే లఖింపూర్ దాడికి దారితీశాయి. బిజెపి కుట్ర ఇప్పుడు సామాన్యుడికి సైతం స్పష్టంగా అవగతమవుతోంది. ప్రజాస్వామ్యం పట్ల ప్రధానికి ఏమాత్రం గౌరవం ఉన్నా లఖింపూర్‌లో అమానుష దాడికి ప్రత్యక్షంగా బాధ్యుడైన అజరు మిశ్రా, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ లను ఆ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి. లఖింపూర్‌లో నల్గురు రైతులతో సహా ఎనిమిది మంది మృతికి కారణమైన కేంద్ర మంత్రి తనయుడిపై ఐపిసి సెక్షన్ 302 కింద మర్డర్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి. ఈ ఘటనపై రిటైర్డు న్యాయమూర్తితో దర్యాప్తు కాకుండా ఎస్‌కెఎం రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరినట్లు సుప్రీం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తునకు ఆదేశించాలి. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు నల్ల చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలి.










