Dec 21,2022 23:46

ఆర్‌అండ్‌బి ఎస్‌ఇకి వినతిపత్రం ఇస్తున్న ముస్లిములు

ప్రజాశక్తి -కంచరపాలెం : మర్రిపాలెంలోని ముస్లిముల నమాజ్‌కు అవసరమైన ఈద్గా స్థలాన్ని కేటాయించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కె.జాన్‌సుధాకర్‌ను కలిసిన మర్రిపాలెం మస్జీద్‌ ఆల్‌ ఫత్‌ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. తమ మస్జీద్‌కు స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విన్నవించగా, ఆయన స్పందించి పిఎం.పాలెంలో స్థలం కేటాయించారని, అయితే మర్రిపాలెం ప్రాంత ముస్లిములు ప్రార్థనలు, నమాజ్‌కు అంతదూరం వెళ్లడం సాధ్యం కాని పరిస్థితుల్లో తమకు అందుబాటులో మర్రిపాలెం ప్రాంతంలోని ఏదైనా ఆర్‌అండ్‌బి స్థలాన్ని మస్జీద్‌కు కేటాయించాలని కోరారు. దీనిపై గతంలోనే విశాఖ జిల్లా కలెక్టర్‌, ఆర్‌డిఒలకు విన్నవించామన్నారు. తమకు మర్రిపాలెంలో స్థలం కేటాయిస్తే, దానికి ప్రతిగా తమకు పిఎంపాలెంలో కేటాయించిన స్థలాన్ని ఆర్‌అండ్‌బి శాఖకు ఇచ్చేస్తామని విన్నవించారు. దీనిపై ఎస్‌ఇ స్పందిస్తూ, విషయాన్ని ఆర్‌అండ్‌బి శాఖ ఉన్నతాధికారులకు నివేదించి, ముస్లిములకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు గౌస్‌, సుభాన్‌, బాబా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.