చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి బొంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. న్యాయాన్యాయాలకంటే ఈ తీర్పుల సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగానూ, ఆందోళనకరంగానూ ఉన్నాయి. 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం...చర్మం తగలనందున ( నో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్) దానిని లైంగిక వేధింపు కింద పరిగణించలేమని ఒక తీర్పులో వ్యాఖ్యానించగా ఇంకో తీర్పులో మరింత వెగటు పుట్టించేలా ధర్మాసనం తీర్పు వెలువరించింది. మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం, పడుకోవడానికి రమ్మని పిలవడం లైంగిక వేధింపుల కిందికి రాదట! ఈ రెండు తీర్పులనూ ఇచ్చింది ఒక మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. బొంబే హైకోర్టులోని నాగపూర్ ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ పుష్ప గనేడీవాలా ఈ దుర్మార్గకపు తీర్పులు వెలువరించారు. లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ ఇచ్చిన 'నో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్' తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం విదితమే.
రెండో కేసులో బాలికను లైంగికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే ముద్దాయి ఆ ఇంట్లో ప్రవేశించినట్టు నిరూపించినా, లైంగిక దాడి జరిగినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయారని ధర్మాసనం పేర్కొంటూ నిందితుడికి విముక్తి కల్పించారు. లైంగిక వాంఛతో శారీరకంగా దగ్గర కావడాన్నే పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారని, అలా జరిగినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి తెలిపారు. ఒక కామోన్మాది ఉద్దేశ్యం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా సాంకేతిక కారణాలను సాకుగా చూపి విముక్తిడిని చేయడమేగాక, పురుషాధిక్యపు భావజాల మూలాలతో వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. పైగా ఇది చాలా చిన్న నేరమని పేర్కొంటూ ఇతర సెక్షన్ల కింద అయిదు నెలల జైలు శిక్ష సరిపోతుందని న్యాయమూర్తి తేల్చేస్తే ఇక దిక్కేముంటుంది? ధర్మాసనం నిర్దోషిగా తేల్చేసిన ఆ దుర్మార్డుడు ఒడిగట్టిన అఘాయిత్యం చూస్తే రక్తం మరగకమానదు. ఆ దుర్మార్గుడికి కింది కోర్టు శిక్ష వేసినా..హైకోర్టులో అప్పీలు చేయడంతో ఇప్పుడు తప్పించుకున్నాడు.
అసభ్యకరమైన మాటలు, వెకిలి చేష్టలు స్త్రీలను వేధిస్తాయి. చిన్న పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఆ పిల్లలు పెద్దయ్యాక కూడా దీర్ఘకాలం కొనసాగుతుంది. ఆ పిల్లలు దారుణమైన మానసిక ఒత్తిడికి, దిగ్భ్రాంతికి గురౌతారు. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. కానీ ఆ న్యాయమూర్తికి ఇవేమీ పట్టలేదు. లైంగిక పెడ ధోరణులు మాములే. వాటిని అంత తీవ్రమైన తప్పులనుకోలేమని చెప్పే పురుషాహంకార ప్రభావమే ఇలాంటి తీర్పులకు కారణం. మనువాద పునాదులపై సమాజంలో నాటుకుపోయిన ఇలాంటి పురుషాహంకార భావజాలాన్ని న్యాయ వ్యవస్థలోకి జొప్పించి భాష్యాలు చెప్పడం అసాధారణమేమీ కాదు. పోక్సో చట్టానికి ఇప్పటి వరకూ కొన్ని ముఖ్యమైన సవరణలు చేసినా, పితృసామ్య భాష్యాలను జొప్పించే తాజా తీర్పుల వంటి చర్యలను కూడా అడ్డుకోవడానికి అడుగులు పడాలి. ఈ దిశగా ప్రభుత్వాలు, సర్వోన్నత న్యాయస్థానమూ తగిన మార్గదర్శకాలను రూపొందించడం అవశ్యం.
నేతిబీరలో నేయి ఉంటుందనేది ఎంత భ్రమో..పెట్టుబడిదారి సమాజపు న్యాయవ్యవస్థలో సామాన్యులందరికీ న్యాయం దక్కుతుందనేది అంతే వాస్తవం. మానవ సంబంధాలను, భావోద్వేగాలను, రాగద్వేషాలను సైతం వినిమయ వస్తువులుగా మార్చేసి కార్పొరేట్ కంపెనీలు సాగిస్తున్న లాభాల వేటలో మానత్వం మంటగలిసిపోతోంది. మూఢత్వం, వికృత చేష్టలు పెచ్చరిల్లుతున్నాయి. పితృస్వామ్య ఆధిపత్యమున్న మనలాంటి దేశాల్లో ఇలాంటి ఆకృత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రధానంగా మహిళలు, చిన్నారులు వికృత దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ దాష్టీకాలకు కారణమైన పురుషాధిక్య జాడ్యపు కోరల నుంచి సమాజం బయట పడాలంటే నూతన, ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఉద్యమాన్ని నిర్వహించడం ఎంతైనా అవసరం.










