
ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం మేజర్ పంచాయతీ కొత్తకోటలో రోడ్డు విస్తరణ పనులు ప్రజల్లో పను అనుమానాలను రేకెత్తిస్తోంది. ఒక్కో దగ్గర ఒక్కో విధంగా రహదారి విస్తరణకు కొలతలు తీస్తుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కుమ్మక్కవడం విశేషం. కొత్తకోటలో ఇరు పార్టీలకు చెందిన వారికి చెందిన గృహ, దుకాణ సముదాయాలు రోడ్డు ఇరు వెంబడి ఉండటంతో రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, సర్వే బృందం అధికారులతో లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్త్తున్నాయి. అందుకు ఇరు పార్టీల పెద్దలు అధికారులతో పలు దపాలుగా లోపాయి కారిగా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. మార్కింగ్ సమయంలో ఇరు పార్టీల నాయకులు అధికారులకు పలు సూచనలు చేయడంతో ఈ అనుమానాలు మరింత వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో ఆర్‌అండ్‌బికి చెందిన స్థలం అని తెలిసినా లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించడం, దుకాణ సముదాయాలు కట్టి అద్దెలకు ఇచ్చి లబ్ది పొందటంతో బల పడిన కొంత మంది నేడు అ ఆక్రమణలు తొలగింపునకు గురి కావడంతో ఎలా అయినా విస్తరణ పనులను అడ్డు కోవాలన్న ఉద్ధేశ్యంతో ఉన్నారు. గత కొన్ని రోజుల కిందట స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామ పెద్దలతో పాటు ఆక్రమణల దారులతో రెండవ దపా నిర్వహించిన సమావేశంలో మండలం తహసీల్దార్, రోడ్డు విస్తరణ పనులకు ఆక్రమణలు తొలగించేందుకు సర్వే సిబ్బందికి సహక రించాలని కోరడంతో పాటు ఆర్‌అండ్‌బి స్థలాన్ని ఉపయోగించుకొని ఇన్నేళ్లుగా అద్దెల రూపంలో లక్షల రూపాయిలు లబ్దిపొందిన మీరు ఇకపై విస్తరణ కు తమ పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖకు చెందిన స్థలాన్ని ముందుగా గుర్తించి సైడ్ కాలవులు నిర్మించిన అనంతరం రోడ్డు విస్తరణ చేపడతామని నర్సీపట్నం ఆర్‌అండ్‌బి జెఈ జయరాజ్ ప్రకటించగా...ఆది కార్య రూపం దాల్చలేదు. అయితే తీరా మార్కింగ్ సమయానికి నాయకుల సాయం తో మూడు శాఖల అధికారులను లోబర్చు కున్నట్టు భోగట్ట.
ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం వారు వేసిన మార్కింగ్ పలు విమర్శలకు తావిస్తోంది. రోలుగుంట మండలం వెలంకాయపాలెం నుంచి చోడవరం మండలం గంధవరం వరకు రోడ్డు విస్తరణ పనులను న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.104 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ చేస్తున్న సంగతి తెలిసిందే.
మొదట 40..ఆ తర్వాత 30 అడుగులు
అయితే అన్ని గ్రామాల్లో అక్రమణలు గుర్తించి తొలగించగా, కొత్తకోటలో మాత్రం 15 ఏళ్లుగా విస్త రణకు నోచుకోలేదు. దీంతో, రోడ్డు కిరువైపులా ఆక్రమణలకు గురై కుదించుకు పోయింది. రెండు బస్సులు ఎదురే దురుగా వస్తే వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో రోడ్డు సెంటర్ నుంచి ఇరువైపులా 40 అడుగులు తొలగిస్తారని మొదట్లో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బహిరంగ సభలో ప్రకటించారు. అలాగైతే దుకాణాలు కొన్ని కనుమరు గవుతున్నాయని భావించి ఇరువైపులా 35 అడుగులకు చేస్తారన్నారు. ఆ తర్వాత 30 అడుగులకు తగ్గించారు. ఇప్పుడు ఇచ్చిన మార్కింగ్ కనీసం 20 అడుగులు కూడా కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. తరచూ స్థానిక నాయకులతో సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నా, పనుల్లో మాత్రం పురోగతి కనపడలేదు.
ఒక్కో దగ్గర ఒక్కో విధంగా మార్కింగ్
ఎట్టకేలకు మే నెల 26న సర్వే బృందం మార్కింగ్ పనులు చేపట్టగా పలు విమర్శలకు తావిస్తోంది. స్టేట్ బ్యాంకు నుంచి పంచాయితీ, సాయి బాబా దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం వరకూ సుమారు 70 అడుగుల విస్తీర్ణం మేర మార్కింగ్ చేయగా, అక్కడ నుంచి మార్కింగ్ పనుల్లో కొలతలు తేడాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడున్న ఇరుకు రోడ్డు దర్శనం ఇస్తోంది. తరచూ రద్దీగా ఉండే మూడురోడ్ల కూడలిలో మాత్రం 50 అడుగులకు తగ్గిపోయింది. మరలా సెంటర్ దాటిన తర్వాత విశాలంగా మార్కింగ్ చేశారు. ఒక్కో చోట ఒక పక్కకు ఎక్కువ గానూ మరొక చోట మరొక పక్కకు తక్కువగా మార్కింగ్ చేయడం తో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సెంటర్ నుంచి ఇరువైపులా సమానంగా తీస్తామని ప్రకటించి ఇప్పుడిలా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎవ్వరికో మేలు చేయడం కోసమే ఇలాంటి కొలతలు చేయడం సబబు కాదని సంబందిత ఉన్నతాధికారులు కల్పించుకుని సమన్యాయం పలువురు కోరుతున్నారు.
మార్కింగ్‌పై ధర్మశ్రీ దష్టికి
కొత్తకోట లో రోడ్డు విస్తరణ మార్కింగ్ విషయాన్ని ఇటీవల పలవురు నాయకులు విప్ ధర్మశ్రీ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే సిబ్బంది లాలూచీ పడటమో, లేదా బెదిరింపు లకు భయపడి తప్పుడు మార్కింగ్ ఇస్తే సహించ బోనని కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. గతంలోనే రోడ్డు సెంటర్ నుంచి ఇరువైపులా 40 అడుగుల మేరకు మార్కింగ్ ఇవ్వాలని కలెక్టర్ నుంచి, ఆర్‌అండ్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ విధంగా సర్వే చేయాలని, విమ ర్శలకు తావివ్వవద్దని సిబ్బందిపై మండిపడ్డారు.