Oct 26,2023 22:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలోని డ్రైవింగ్‌ స్కూల్లో నిర్వహకులు విద్యార్ధులకు మొక్కుబడిగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న విషయం విధితమే. అత్యధిక మందికి సరైన నైపుణ్యం లేకపోవటం, కొద్దిపాటి డ్రైవింగ్‌ అనుభవంతో రోడ్డు మీదుకు రావటమే ప్రమాదాలకు కారణమనే విమర్శలు లేకపోలేదు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఇటీవల కాలంలో ఎక్కడపడితే అక్కడ డ్రైవింగ్‌ స్కూల్స్‌ వెలుస్తున్నాయి. కేవలం 3 లేక 4 వారాల్లో శిక్షణ పూర్తి చేసి, లైసెన్సులు మంజూరు చేసి నిర్వహకులు ఆయా స్కూల్‌ నిర్వహకులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థులకు డ్రైవింగ్‌లో మెళకువలు, రోడ్డు భద్రతా నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సివుంది. కానీ, డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిర్వాహకులు డబ్బు సంపాదనకే అధిక ప్రాధాన్యత నిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఇవీ నిబంధనలు..
జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 100కు పైగా డ్రైవింగ్‌ స్కూళ్లు ఉన్నట్లు సమాచారం. డ్రైవింగ్‌ స్కూళ్ల యాజమాన్యాలు అభ్యర్థుల నుంచి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహకులు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారే డ్రైవింగ్‌ స్కూల్‌కు అర్హులు. మోటారు వాహనాలకు సంబంధించిన విద్యలో ఏదో ఒక సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. అనుభవజ్ఞులైన ఇన్‌స్ట్రక్టర్‌ ఉండాలి. డ్రైవింగ్‌ స్కూల్‌ కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీసులు కలిగి ఉండాలి. ట్రాఫిక్‌ నిబంధనలపై శాస్త్రీయ బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకునే మెకానిజంపై కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ స్కూళ్లలో రోడ్డు భద్రతా నిబంధనల సూచికలను ఏర్పాటు చేసి కనీసం మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వాలి. వాహనాలకు సంబంధించిన విడిభాగాల ప్రదర్శన ఉంచాలి. వాటి పనితీరుపై శిక్షణ తరగతి నిర్వహించాలి. ఆ తర్వాతనే కార్లు నడిపేందుకు మైదానంలో శిక్షణ ఇవ్వాలి. అయితే అత్యధిక మంది కార్యాలయాలు లేకుండానే కారుపై డ్రైవింగ్‌ స్కూల్‌ బోర్డు ఏర్పాటు అభ్యర్ధులకు కేవలం నాలుగు వారాల్లో శిక్షణ పూర్తి చేసేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు...
డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంది. డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిర్వాహకులు ఆర్‌టిఎ కార్యాలయంలోని సిబ్బందితో ఉన్న సత్సంబంధాలతో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రతి రోజు రవాణా శాఖ కార్యాలయంలో పదుల సంఖ్యలో కార్లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. అంతకంటే రెట్టింపు స్థాయిలో కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు యువతీ, యువకులు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కొందరు డ్రైవింగ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసుకుని ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణాశాఖ అధికారులు ఎడాపెడా అనుమతిస్తున్నారు. డ్రైవింగ్‌ స్కూళ్ల అనుమతుల కోసం వేలల్లో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంతప్తి చెందిన తర్వాతనే అనుమతివ్వాలి. ఇందుకోసం డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు రూ.10వేలు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను రవాణా శాఖకు చెల్లించాలి. అయితే అటువంటి నిబంధనలు అమలు కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.