ప్రేమ...
వేల జన్మల పుణ్యఫలం
కోటీ ఉషస్సుల కాంతిపుంజం
పంచభూతాల పరిమళం
ప్రకృతికి మరోరూపమనే
కనీస అవగాహనలేక...
వయసు వాకిట్లోకి
వసంతం అడుగిడగానే
కొత్తరెక్కలేవో మొలిచినట్టు
ఆకర్షణ పత్రాల మోజుకి
దాసోహమవ్వడం
ఒడలిన తర్వాత
వికర్షణకు గురయ్యి
నీవు లేని నేనుండను
నేనులేని నీవుండవొద్దంటూ
జీవితానిచ్చి చేయూతలందించి
ఆప్యాయతలతో
అభివృద్ధి పథాన నడిపించిన
అమ్మా నాన్నలకి
ఆసరా కావల్సిందిపోయి
అంతిమ గీతాలాలపిస్తూ
కడుపుకోత రగిలిస్తున్న
ఓ భగ్న ప్రేమికా...
అంతంచేసే ముందు
అంతమయ్యే ముందు
ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకో...
నేనెవరిని? నేనెందుకు ఇలా!
ఆయువు పోయలేని నీకు
తీసే హక్కు ఏదీ?
ఓ యువతా!
జీవితాన్ని ఇష్టపడండి
నష్టపరచకండి
ఆకర్షణ...వికర్షణలకు
నైవేద్యం కాకండి
ప్రయోజకులై
కన్నపేగులకు
సాంత్వన చేకూర్చండి
ప్రేమరక్కసులు కావద్దు
అనురాగ దేవతలు కావాలి
వేమూరి శ్రీనివాస్
99121 28967